సినిమా రివ్యూ : హిట్ 2

నటీనటులు : అడివి శేష్‌, మీనాక్షి చౌద‌రి, రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ ముర‌ళి, త‌నికెళ్ల భ‌ర‌ణి, శ్రీనాథ్ మాగంటి, కోమ‌లి ప్ర‌సాద్ త‌దిత‌రులు
ఛాయాగ్రహణం : మ‌ణి కంద‌న్‌ ఎస్‌
నేపథ్య సంగీతం : జాన్ స్టీవార్ట్ ఏడూరి
స్వరాలు : ఎం.ఎం. శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి
సమర్పణ : నాని 
నిర్మాత : ప్రశాంతి త్రిపిర్‌నేని
రచన, దర్శకత్వం : శైలేష్ కొలను 
విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022

నిర్మాతగా నాని తీసిన విజయవంతమైన సినిమాల్లో ‘హిట్’ ఒకటి. శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయమైన ఆ సినిమాలో విశ్వక్ సేన్ హీరో. ‘హిట్’ సూపర్ హిట్ కావడంతో ఆ ఫ్రాంచైజీలో ఏడు సినిమాలు తీయాలని నిర్ణయించారు. హిట్ సినిమాటిక్ యూనివర్స్‌లో రెండో సినిమా ‘హిట్ 2’ (Hit 2 Movie)లో అడివి శేష్ (Adivi Sesh) హీరో. మీనాక్షి చౌదరి హీరోయిన్. దర్శక నిర్మాతలు సేమ్. ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ (Hit 2 Movie Story) : కేడీ అలియాస్ కృష్ణదేవ్ (అడివి శేష్) విశాఖలో ఎస్పీ. ఓ మర్డర్ కేసును సాల్వ్ చేసిన తర్వాత క్రైమ్స్ చేసేవాళ్లను ‘కోడి బుర్రలు’ అంటాడు. వాళ్ళను పట్టుకోవడానికి పెద్ద టైమ్ అవసరం లేదని  చెబుతాడు. అటువంటి కేడీకి ఓ సీరియల్ కిల్లర్ సవాల్ విసురుతాడు. నగరంలో సంజన అనే అమ్మాయిని హత్య చేస్తాడు సీరియల్ కిల్లర్. తల, మొండెం, కాళ్ళు, చేతులు… నాలుగు భాగాలుగా బాడీని సపరేట్ చేస్తాడు. తల మాత్రమే సంజనాది అని… మొండెం, కాళ్ళు, చేతులు మరో ముగ్గురు అమ్మాయిలవి అని ఫోరెన్సిక్ టెస్టులో తెలుస్తుంది. ఈ కేసును కేడీ ఎలా సాల్వ్ చేశాడు? కేసును ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో అతడి గాళ్ ఫ్రెండ్ ఆర్య (మీనాక్షి చౌదరి) కి ఎందుకు సెక్యూరిటీ ఇచ్చారు? ఈ కథలో లేడీ పోలీస్ వర్ష (కోమలీ ప్రసాద్), కేడీ పైఅధికారి నాగేశ్వరారావు (రావు రమేష్) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.    

విశ్లేషణ (Hit 2 Movie Telugu Review) : థ్రిల్లర్ సినిమాలతో ఓ సమస్య ఉంటుంది. ట్విస్ట్ చెబితే ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ పోతుంది. చెప్పకుండా ఎక్కువసేపు కథను ముందుకు నడిపితే సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. పైగా, పాత సినిమాలతో పోలికలు రాకుండా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడం దర్శకులకు కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. యాసిడ్ టెస్ట్ లాంటిది. ‘హిట్’ విషయంలో దర్శకుడు శైలేష్ కొలను ఆ టెస్ట్ పాస్ అయ్యారు. దాంతో ‘హిట్ 2’ మీద అంచనాలు పెరిగాయి. 

‘హిట్’లో ఎవరు హత్యలు చేశారో చెప్పకుండా చివరి వరకూ కథను నడిపారు. ‘హిట్ 2’ విషయంలో అలా కాదు… సీరియల్ కిల్లర్ ఎవరో చెప్పేశారు. కథలో కంటెంట్ ఉంది. అయితే… కంటిన్యూగా ఎంగేజ్ చేయడంలో మాత్రం కాస్త తడబడ్డారు. ‘హిట్ 2’ స్టార్టింగ్ బావుంటుంది. కాసేపటి తర్వాత కిల్లర్ ఎవరనేది ప్రేక్షకుడి ఊహకు అందుతూ ఉంటుంది. అందువల్ల, సస్పెన్స్ ఫ్యాక్టర్ ఎక్కువ లేదు. సీరియల్ కిల్లర్ ఫ్లాష్ బ్యాక్ విన్న తర్వాత అప్పటి వరకు ఉన్న ఇంపాక్ట్ పోతుంది.    

కథలో ట్విస్టులు కూడా ఊహించేలా ఉన్నాయి. లాజిక్స్ పక్కన పెట్టి మేజిక్ మీద నమ్మకం ఉంచారు. నిడివి తక్కువ అయినప్పటికీ ఎక్కువసేపు చూసిన ఫీలింగ్ ఉంటుంది. టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉంది. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించగా… సిద్ శ్రీరామ్ పాడిన ‘ఉరికే ఉరికే…’ పాట బావుంది. జాన్ స్టీవార్ట్ ఏడూరి నేపథ్య సంగీతం కథలో మూడ్ క్యారీ చేసింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. 

నటీనటులు ఎలా చేశారు? : అడివి శేష్‌కు థ్రిల్లర్ జానర్ ఫిల్మ్స్ చేయడం బాగా అలవాటు. ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే ఎక్కువ థ్రిల్లర్స్ ఉంటాయి. అందువల్ల, ఈజీగా చేసుకుంటూ వెళ్ళారు. అడివి శేష్ నటనకు వంక పెట్టడానికి ఏమీ లేదు. అలాగని కొత్తగానూ లేదు. కథకు ఆయన పర్ఫెక్ట్ యాప్ట్. మీనాక్షి చౌదరి ఓ పాటలో లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ చేశారు. పతాక సన్నివేశాల్లో ఎమోషనల్ సీన్ కూడా బాగా చేశారు. క్యారెక్టర్‌కు అవసరమైన ఇంటెన్స్‌ను కోమలీ ప్రసాద్ క్యారీ చేశారు. లేడీ పోలీస్‌గా ఆమె డ్రస్సింగ్, యాక్టింగ్ బావున్నాయి.మిగితా పాత్రల విషయానికి వస్తే.. పోలీస్ ఆఫీసర్‌గా శ్రీనాథ్ మాగంటి మరో మంచి పాత్రలో ఆకట్టుకొన్నాడు. పాత్ర నిడివి తక్కువైనా కీలక సన్నివేశాల్లో తన ప్రజెన్స్‌ను చూపించుకొన్నాడు. రావు రమేష్ పాత్రల పరిధి మేరకు నటించారు. సుహాస్ ప్రత్యేక పాత్రలో సర్‌ప్రైజ్ చేస్తారు.  

ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : ‘హిట్ 2’ డీసెంట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఫస్టాఫ్‌లో కథ కంటే కథనం ఉత్కంఠ కలిగిస్తుంది. సెకండాఫ్ స్టార్ట్ అయిన తర్వాత, అసలు కథలోకి వెళ్ళాక… సాగదీసిన ఫీలింగ్ ఉంటుంది. నార్మల్ థ్రిల్లర్‌ను అడివి శేష్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చూడబుల్‌గా మార్చింది. థ్రిల్లర్ జానర్ ఆడియన్స్ ఓసారి ట్రై చేయవచ్చు. మిగతావాళ్ళు ఆలోచించాలి.