ఆ మహానుభావుడుతో మళ్లీ కలుస్తున్నాడు

ప్రస్తుతం ఆర్.ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతితో మహాసముద్రం సినిమా చేస్తున్నాడు యంగ్ హీరో శర్వానంద్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లవర్ బాయ్ సిద్దార్థ్ విలన్ గా నటిస్తున్నాడు. సిద్దార్థ్ కంబ్యాక్ ఇస్తున్న ఈ మహాసముద్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతున్న సమయంలో శర్వానంద్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నాడు. అది కూడా తనకి 2017 లో హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే కావడం విశేషం. 2017లో ‘మహానుభావుడు’ సినిమాతో దర్శకుడు మారుతి, శర్వానంద్‌ ను వినూత్నంగా చూపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శర్వా ఓసీడీ (ఓవర్ క్లీనింగ్‌ డిజార్డర్‌) తో బాధపడుతున్నట్లు చూపిస్తారు. ఈ సమయంలో నమస్కారం చేయాలి, చేతులు కడుక్కోవాలి, సామాజిక దూరం పాటించాలి అని శర్వా చెప్తే నవ్వాము కానీ ఇప్పుడు కరోనా కారణంగా అదే చేస్తున్నాం. లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుందనే వార్త వినిపిస్తుంది. ఇప్పటికే ఈ కథ విన్న శర్వానంద్ కూడా ఒకే చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ సినిమా తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ షూటింగ్ పూర్తికానుందని తెలుస్తోంది. పక్కా కమర్షియల్ సినిమా తర్వాత మారుతీ అండ్ శర్వానంద్ కోలాబోరేట్ అవ్వనున్నారు.