వాళ్లు చెప్తే మా ఎన్నికల నుంచి తప్పుకుంటా, మంచు విష్ణు సెన్సేషనల్ స్టేట్మెంట్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపధ్యంలో ఫిల్మ్ నగర్ లో జరగాల్సిన రచ్చ కాస్త మీడియా ఛానెల్స్ వరకూ పాకింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో, పరభాషా నటుడిని మా ప్రెసిడెంట్ గా ఎలా గెలిపిస్తారు అంటూ విమర్శలు కూడా మొదలయ్యాయి. ఈ ఎన్నికల రేస్ లోకి మంచి విష్ణు రావడంతో అధ్యక్ష ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. తాను ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నట్లు ఇటివలే ప్రకటించిన విష్ణు… బాలకృష్ణ, నాగార్జున, కృష్ణ, కృష్ణంరాజు, వెంకటేష్, మోహన్ బాబు, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలు ఇండస్ట్రీ పెద్దలు చెప్తే తాను ఎన్నికల నుంచి తప్పుకుంటాను అంటూ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇండస్ట్రీ పెద్దలంతా కూర్చోని ఒకరిని అధ్యక్షుడిగా ప్రకటిస్తే తాను వారి మాటకి గౌరవం ఇస్తాను కానీ ఎన్నికలు జరగాల్సి వస్తే మాత్రం తాను కచ్చితంగా పోటీ చేస్తాను అని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పేశాడు. ఒక వీడియో రూపంలో తను అనుకున్న విషయాలని చెప్పుకుంటూ వచ్చిన మంచు విష్ణు, మా అసోసియేషన్ బిల్డింగ్ తన సొంత డబ్బులతో కట్టిస్తానని, ఇకపై ఆ టాపిక్ తో చర్చ ఉండకూడదు అని చెప్పాడు. నటులకి ఉన్న సమస్యలని తీర్చడం గురించి అసోసియేషన్ ఆలోచించాలి కానీ బిల్డింగ్ గురించి తాను చూసుకుంటాను అని చెప్పిన విష్ణు… ప్రెసిడెంట్ గా తనని గెలిపిస్తారని ఆశిస్తున్నాను అంటూ వీడియో ముగించాడు.