థియేటర్ల వద్ద మళ్లీ సందడి షూరూ

లాక్‌డౌన్ వల్ల మూతపడిన థియేటర్లు చాలా నెలల తర్వాత ఇటీవల ఓపెన్ అయిన విషయం తెలిసిందే. 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజేషన్ చేయడం లాంటి నిబంధనలు పాటిస్తూ థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా థియేటర్లకు అనుమతిచ్చాయి. థియేటర్లకు కరెంట్ బిల్లులను మాఫీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

theaters

దీంతో ఈ నెల 5వ తేదీ నుంచి తెలంగాణలో థియేటర్లు ఓపెన్ అవ్వగా.. మొదటగా ‘టెనెట్’ సినిమా విడుదలైంది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు బాగానే వచ్చినట్లు థియేటర్ యాజమాన్యాలు చెబుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెరిగినట్లు చెబుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు ఇష్టపడుతున్నారని, ఫ్రెండ్స్, బంధువులతో కలిసి సినిమా చూసేందుకు ఇష్టపడుతున్నారని థియేటర్ యాజమాన్యాలు చెప్పాయి.

50 శాతం అక్యూపెన్సీతో థియేటర్లకు అనుమతి ఇవ్వగా.. ప్రేక్షకుల రద్దీ పెరగుుతుండటంతో చాలా థియేటర్లు 80 నుంచి 90 శాతం అక్యూపెన్సీతో థియేటర్లలో నడుపుతున్నాయి. ఇది శుభపరిణామం అని, కరోనా వల్ల నష్టపోయిన ఇండస్ట్రీ కూడా త్వరలో కోలుకుని సాధారణ పరిస్థితులు ఏర్పడతాయనే నమ్మకం తమకు ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.