‘గేమ్ ఛేంజర్’ సినిమా నుండి రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా “జరగండి” పాత విడుదల

హీరో రామ్ చ‌ర‌ణ్‌ పాట పాడితే వినటానికి మ‌న‌సుకి ఉత్సాహంగా ఉంటుంది. మ‌రి దాన్ని సిల్వ‌ర్ స్క్రీన్‌పై శంక‌ర్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తే చూడ‌టానికి రెండు క‌ళ్లు చాల‌వ‌నేంత గొప్ప‌గా ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు. రామ్ చ‌ర‌ణ్‌, కియారా ఆటా పాట‌, త‌మ‌న్ సంగీతం, శంక‌ర్ మేకింగ్ స్టైల్లో వావ్ అనేలా తెర‌కెక్కిన ఈ పాట‌ను చూడాలంటే ‘గేమ్ ఛేంజర్’ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందేనంటున్నారు నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్‌.

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ ఛేంజర్’.  శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ భారీ బ‌డ్జెట్‌తో అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు.

మార్చి 27న రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘జ‌ర‌గండి’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 150 పైన థియేటర్స్‌లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించటం విశేషం. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీత సారథ్యంలోని ఈ పాట‌ను అనంత శ్రీరామ్ రాయ‌గా ద‌లేర్ మెహందీ, సునిధీ చౌహాన్ పాడారు.

‘జరగండి’ పాట విషయానికి వస్తే.. రామ్ చరణ్, కియార అద్వానీ జంట స్క్రీన్‌పై చూడ ముచ్చ‌ట‌గా ఉంది. ఇక డైరెక్ట‌ర్ శంక‌ర్ మేకింగ్‌లో త‌న‌దైన భారీతనాన్ని చూపించ‌బోతున్నార‌ని పాట‌లోని కొన్ని స‌న్నివేశాల‌ను చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. పాటే ఈ రేంజ్‌లో ఉంటే శంక‌ర్.. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను ఏ రేంజ్‌లో తెర‌కెక్కిస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ హీరోగా వ‌స్తోన్న సినిమా కావ‌టంతో గేమ్ ఛేంజ‌ర్ కోసం మెగాభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.

నటీనటులు:

రామ్ చరణ్, కియారా అద్వానీ, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు

సాంకేతిక వర్గం:

సమర్పణ-శ్రీమతి అనిత, బ్యానర్స్ – శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీస్టూడియోస్, నిర్మాతలు – దిల్ రాజు, శిరీష్, సినిమాటోగ్రఫీ – తిరుణ్ణావుక్కరసు, సంగీతం – ఎస్.ఎస్.తమన్, యాక్షన్ – అన్బరివు, కథ – కార్తీక్ సుబ్బరాజు, డైలాగ్స్ – సాయి మాధవ్ బుర్రా, ఆర్ట్ – అవినాష్ కొల్ల, రామకృష్ణ, మోనిక, కొరియోగ్రఫీ – ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండి, పాటలు – రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, వి.ఎఫ్.ఎక్స్ – శ్రీనివాస్ మోహన్, ఆడియో – సరిగమ మ్యూజిక్, పి.ఆర్.ఓ – నాయుడు సురేంద్ర కుమార్