15 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన కత్తి మహేశ్ మరణించారు

2 వారాల క్రితం నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ గాయపడ్డారు. కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటెనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్‌ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదం కారణంగా ఆయన రెండు కళ్ళు పోగొట్టుకున్నారు. తలకి బలమైన గాయం తగిలింది. దాదాపు 15 రోజుల నుంచి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కత్తి మహేశ్ ఈరోజు చెన్నై అపోలో హాస్పిటల్ లో మరణించారు.

తొలుత నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడుతుంది అనుకుంటున్న తరుణంలో ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం కన్నుమూశారు. ఇటీవలే అయిన వైద్య ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ.17 లక్షలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఏ విషయంలో అయిన తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పే కత్తి మహేశ్, సినిమాల పట్ల నిష్పక్షపాతంగా రివ్యూ ఇచ్చే వాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివిన కత్తి మహేశ్, UNICEF, World Bank, Save the Children, The Clinton Foundation లాంటి సామజిక దృక్పధం ఉన్న సంస్థలతో కలిసి పని చేశారు. మంచి విధ్యావేత్తా, వక్త అయిన కత్తి మహేశ్ చాలా కాంట్రవర్సిల్లో ఇరుకున్నాడు. రాముడి పై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఆరు నెలల పాటు ఆయన్ని హైదరాబాద్ నుంచి బహిష్కరించారు కూడా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ కూడా కాంటెస్టెంట్ గా కూడా చేసిన కత్తి మహేశ్ బుల్లితెర వీక్షకులని అలరించాడు. తన జీవితంలో ఏం జరిగిన చెప్పాలి అనుకున్నది ముక్కుసూటిగా చెప్తూ వచ్చిన కత్తి మహేశ్ మృతి పట్ల సిని, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.