ఆర్ఆర్ఆర్‌పై వెరైటీగా ఓ అభిమాని సెటైర్.. చిత్ర‌బృందం రీట్వీట్‌!

ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ గురించి అప్‌డేట్స్ కోసం ప్రేక్ష‌కులు, అభిమానులు ఎదురు చూసీ చూసీ ఈ సినిమా‌పై సెటైర్లు వేస్తున్నారు. ‌తాజాగా సంక్రాంతి సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర‌యూనిట్ నుంచి ఏ అప్‌డేట్ రావ‌ట్లేద‌ని ఓ అభిమాని ఏకంగా ఆర్ఆర్ఆర్ రాజ‌మౌళి కుటీరం పేరుతో కార్టూన్లు వేసి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ నిల్చొని ఉండ‌గా.. ఇద్ద‌రు ఆడ‌వాళ్లు సంక్రాంతి ముగ్గులు వేస్తూ.. అక్కా ఇంత‌కీ సినిమా రిలీజ్ ఎప్పుడు..? అని చెల్లి ప్ర‌శ్నించ‌గా.. దీనికి అక్క సమాధాన‌మిస్తూ.. త‌ప్ప‌మ్మా తెలియ‌నివి అడ‌క్కూడ‌దు అంటూ ఆ అక్క జ‌వాబిస్తుంది.

rrr cartoon

ఇది కాస్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి ఈ సెటైర్‌పై ఆర్ఆర్ఆర్ చిత్ర‌బృందం స్పందించింది. సృజ‌నాత్మ‌క‌తో కూడిన సెటైర్‌.. చాలా బాగుంది. సంక్రాంతి శుభాకాంక్ష‌లు అంటూ రీట్వీట్ చేసింది. దీంతో ఆర్ఆర్ఆర్ అప్‌డేట్ చెప్పండి సార్ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌ల‌ను పోషిస్తుండ‌గా.. ఎన్న‌డు క‌ల‌వ‌ని ఇద్ద‌రు చారిత్ర‌క యోధులైన అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం ఒక‌వేళ క‌లిస్తే ఎలా ఉంటుందో అనే కాల్ప‌ని క‌థ‌తో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న విష‌యం విధిత‌మే. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు సినీ ప్రేక్ష‌కుల్లో నెల‌కొన్నాయి. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ జోడీగా బాలీవుడ్ భామ ఆలియాభ‌ట్ న‌టిస్తుండ‌గా.. ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ న‌టిస్తుంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజ‌య్‌దేవ్‌గ‌ణ్ కీల‌క‌పాత్ర పోషిస్తుండ‌గా.. డివివి దాన‌య్య నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్‌, తార‌క్ టీజ‌ర్లు అభిమానుల‌ను బాగా ఆక‌ట్టుకునేలా చేసిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఎమ్‌. కీర‌వాణీ సంగీతం అందిస్తున్నారు.