‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నటుడు రోహిత్ బాస్ఫోర్ అనుమానాస్పద మృతి

ప్రముఖ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 3’లో నటించిన నటుడు రోహిత్ బాస్ఫోర్ అస్సాంలోని ఓ జలపాతం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఆయన మృతదేహం కనిపించడంతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలన జరిపారు. పోలీసుల వివరాల ప్రకారం, రోహిత్ కొన్ని నెలల క్రితం ముంబయి నుంచి గౌహతికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి విహారయాత్రకు బయల్దేరారు. అయితే, సాయంత్రం నుంచి ఆయన ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు గాలింపు చేపట్టి జలపాతం వద్ద రోహిత్ మృతదేహాన్ని గుర్తించారు.
మృతదేహంపై గాయాలు ఉండటంతో రోహిత్‌ను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొందరు సన్నిహితులే ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ తల్లిదండ్రులు మాట్లాడుతూ, కొద్దిరోజుల క్రితం పార్కింగ్ విషయంలో రంజిత్ బాస్ఫోర్, అశోక్ బాస్ఫోర్, ధరమ్ బాస్ఫోర్ అనే ముగ్గురితో తమ కుమారుడికి వివాదం జరిగిందని, ఈ ఘటన వెనుక వారి ప్రమేయం ఉండొచ్చని ఆరోపించారు. ఈ హత్య ఓ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని వారు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రోహిత్ శరీరంపై ముఖం, తల, ఇతర భాగాలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన సినీ పరిశ్రమలోనూ, రోహిత్ అభిమానుల్లోనూ తీవ్ర కలకలం రేపింది.