‘F3’ షూటింగ్‌పై కీలక అప్డేట్

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘F2’సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ‘F3’సినిమా తీయాలని అనిల్ రావిపూడి నిర్ణయించాడు. లాక్‌డౌన్‌లో ఈ సినిమా స్క్రీఫ్ట్‌కు అనిల్ రావిపూడి మెరుగులు దిద్దగా.. ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంది.

F3

అల్లు అరవింద్ ముహుర్తం షాట్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తమన్నా, వరుణ్ తేజ్, దిల్ రాజు, అనిల్ రావిపూడి పాల్గొన్నారు. డిసెంబర్ 23 నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు ఈ సందర్భంగా సినిమా యూనిట్ ప్రకటించింది. దీని కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్ వేసినట్లు సమాచారం. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించనుండగా.. దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు.

F2 సూపర్ హిట్ కావడంతో F3పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల వెంకటేష్ బర్త్ డే సందర్భంగా F3 సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ విడుదల అవ్వగా.. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ తోపుడు బండ్లలో డబ్బులు నింపుకుని కనిపించారు.