“లవ్ స్టోరి” ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ , 24న థియేటర్ లలో రిలీజ్!!

సంతోషం, బాధ, ప్రేమ, ఉద్యోగం, కుటుంబం…ఇలా జీవితంలోని రంగుల చిత్రాన్ని చూపిస్తూ సాగింది “లవ్ స్టోరి” సినిమా ట్రైలర్. ఇవాళ రిలీజైన “లవ్ స్టోరి” ట్రైలర్ దర్శకుడు శేఖర్ కమ్ముల ట్రేడ్ మార్క్ తో కనిపించింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన “లవ్ స్టోరి” సినిమా ఈనెల 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

“లవ్ స్టోరి” ట్రైలర్ ఎలా ఉందో చూస్తే… నాగ చైతన్య తెలంగాణ ప్రాంతానికి చెందిన రేవంత్ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడుగా కనిపించాడు. లోన్ తీసుకొని బిజినెస్ చేయడం ద్వారా లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకునే డ్యాన్సర్ రేవంత్ గా నాగచైతన్య ను చూపించడంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. మరో వైపు బీటెక్ పూర్తి చేసి ఎలాగైనా సాఫ్ట్ వేర్ జాబ్ సాధించాలనే యువతి మౌనికగా సాయి పల్లవిని చూపించారు. అయితే.. మౌనికలో దాగి ఉన్న డ్యాన్సింగ్ టాలెంట్ ని గుర్తిస్తాడు రేవంత్. ఆమెను మంచి డ్యాన్సర్ అవ్వాలని ప్రోత్సహిస్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడడం.. ఆ స్నేహం ప్రేమగా మారడం.. ఒక ప్రేమ అంటే అడ్డంకులు మామూలే కదా. వీరి ప్రేమకు కూడా అడ్డంకులు ఏర్పడడం.. ఆ అడ్డంకులను దాటుకుని వీళ్లు ఎలా ఒకటయ్యారు అనేదే ఈ లవ్ స్టోరీ అనిపిస్తుంది.

చైతన్య తెలంగాణ యాసలో మాట్లాడడం బాగుంది. అలాగే నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కూడా పాత్రకు తగ్గట్టుగా అదరగొట్టేసింది అనిపిస్తుంది. మనకు లోన్లు ఇవ్వరు.. రెంటుకు రూములు ఇవ్వరు.. పిల్లనిస్తార్రా.. బతుక్కోసం ఈ ఉరుకులాట నాతో కాదింక.. చస్తే చద్దాం.. కానీ తేల్చుకొని చద్దాం వంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మిడిల్ క్లాస్ యువకుడిగా నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ పెరఫార్మన్స్ ఇచ్చాడని చెప్పచ్చు. టోటల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే… లవ్ స్టోరీ ట్రైలర్ అదిరింది. హిట్ పక్కా… అనేట్టు ఉంది.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని,ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
 
సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు, రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.