మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తీస్తున్న ట్రెండ్ సెట్టర్ ఎంటర్ ది గర్ల్ డ్రాగన్

Pooja Bhalekar

ఒకప్పుడు బ్రూస్లీ నటించిన హాలీవుడ్ చిత్రం ఎంటర్ ది డ్రాగన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో బ్రూస్లీ కొన్ని కోట్ల మందికి అభిమానపాత్రులయ్యారు. ప్రఖ్యాత దర్శకులు రాంగోపాల్ వర్మకు కూడా బ్రూస్లీ అంటే ఎనలేని అభిమానం. తన సినిమాలలోని ఫైట్స్ ఆయనను స్ఫూర్తిగా చేసుకుని చేసినవే అని వర్మ చెబుతుంటారు. ఇదిలావుండగా…ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ పేరుతో తన దర్శకత్వంలో ఆర్జీవీ ఇప్పుడు ఓ సినిమాను రూపొందిస్తున్నారు. పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మొదటి ఇండియన్ చిత్రంగా దీనిని పరిగణిస్తున్నారు. మొదటి నుంచి విభిన్నచిత్రాలు చేస్తూ..ఓ ప్రత్యేక పంథా కు తెరతీసిన వర్మ మార్షల్ ఆర్ట్స్ కు గ్లామర్ ను మేళవించి మరో కొత్త ట్రెండుకు తెర తీయబోతున్నారు. ఇండో చైనీస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రధారి పూజా భలేకర్ చేసిన రిస్కీ ఫైట్స్ అత్యంత ఆకర్షణీయంగా, వళ్ళు గగుర్పొడిచేవిధంగా ఉండనున్నాయని చిత్రబృందం వెల్లడించింది. పై పెచ్చు ఆమె గ్లామర్ కూడా ఒక హైలైట్ కానుందని వారు చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు విశేషమైన ప్రేక్షక స్పందన లభించడమే కాదు ట్రెండింగ్ అయ్యింది. లోగడ చైనాలోనూ మేజర్ షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ వైజాగ్ లో పూర్తి చేసుకుంది. జూన్ నెలలో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయనున్నామని చిత్రబంధం ప్రకటించింది.