చలన చిత్ర ‘దర్శకుడి’గా 25 ఏళ్ళు (సిల్వర్‌ జూబ్లీ) పూర్తయిన సందర్భంగా..

నా తల్లిదండ్రులైన శ్రీమతి ‘యలమంచిలి రత్నకుమారి’గారు, స్వర్గీయ ‘యలమంచిలి నారాయణరావు’గార్లు.. తమ బిడ్డగా నన్ను ఈ లోకానికి పరిచయం చేస్తే.. ‘సెల్యూలాయిడ్‌ సైంటిస్ట్‌’ అని నేను పిలుచుకునే ‘యువసామ్రాట్‌’ శ్రీ ‘నాగార్జున అక్కినేని’గారు.. తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘గ్రేట్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్‌పై.. కథానాయకుడిని మించిన తన హుందాతనం మరియు గాంభీర్యంతో కథకి ప్రాణవాయువులా నిలిచి, నడిపించే పాత్రలో ‘నటసామ్రాట్’, ‘పద్మభూషణ్’, ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు గ్రహీత స్వర్గీయ ‘అక్కినేని నాగేశ్వరరావు’గారూ.. నూతన నటీనటులు ‘వెంకట్’ మరియూ ‘చందూ’లు కథానాయకులుగా, ‘చాందినీ’ కథానాయికిగా, స్వర్గీయ ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’గారి గేయ రచనలతో, శ్రీ ‘యం యం కీరవాణి’గారి సంగీత సారథ్యంలో, నా కథారచన మరియూ స్క్రీన్‌ప్లేలతో, స్వర్గీయ ‘జంధ్యాల’గారి మాటలతో, స్వర్గీయ ‘మధు ఎ. నాయుడు’ ఛాయాగ్రహణంతో.. ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ అనే చలన చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకలోకానికి.. నన్ను ‘దర్శకుడు’గా పరిచయం చేశారు. ఎలాగైతే, జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఋణం జీవితాంతం తీర్చుకోలేనిదో.. అలాగే చలన చిత్ర దర్శకుడిగా నాకు జన్మనిచ్చిన శ్రీ ‘అక్కినేని నాగార్జున’గారి ఋణమూ ఎప్పటికీ తీర్చుకోలేనిది.

నేను విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, కళాప్రపూర్ణ, డాక్టర్‌ ‘నందమూరి తారక రామారావు’గారి వీరాభిమానిని అని తెలిసి కూడా శ్రీ ‘అక్కినేని నాగార్జున’గారు నాకు తొట్టతొలి దర్శకత్వపు అవకాశం ఇవ్వడం అనేది.. వారికి, వారి కుటుంబానికి ఉన్న మంచితనం, మానసిక పరిపక్వతలకి నిదర్శనం మరియూ నా పూర్వజన్మ సుకృతం, ఈ జన్మ మహాభాగ్యం.

ఇక్కడ ‘అన్న’‌ ‘ఎన్టీఆర్’గారి తొలి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ పాటనే నా తొలి చిత్రానికి పేరుగా పెట్టుకోవడం అనేది మరియూ స్వర్గీయ ‘ఏ ఎన్ ఆర్’గారికి అద్వితీయ పేరునీ, ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టిన ‘దేవదాసు’ చిత్రం విడుదల 26.06.1953 తేదీ నాడే.. నా తొలి చిత్రం విడుదల కావడం అనేది చూస్తుంటే.. ఆ మహానుభావులిద్దరూ నాకిచ్చిన ఆశీస్సులు, అనుగ్రహం క్రింద భావిస్తున్నాను.

అంతేకాకుండా, నేను.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా వెలుగొందిన ‘ఎన్టీఆర్’గారు మరియు స్వర్గీయ ‘ఏ ఎన్ ఆర్’గార్ల పుట్టిన ఊర్లకి చెందిన ‘గుడివాడ’ తాలూకా వాసిని. స్వర్గీయ ‘ఏ ఎన్ ఆర్’గారు కట్టించిన కాలేజ్ అయిన‌ ‘ఏ. ఎన్‌. ఆర్‌. కాలేజ్‌’ స్టూడెంట్‌ని. ఆయన సొంత చలనచిత్ర నిర్మాణ స్టూడియో అయిన ‘అన్నపూర్ణా స్టూడియో’ ప్రొడక్ట్‌ని, దర్శకులకు అగ్రతాంబూలంతో పాటు అత్యంత గౌరవ మర్యాదలనిచ్చే మహానటులైన స్వర్గీయ ‘ఏ ఎన్ ఆర్’గారిని నా తొలి సినిమాలోనే నటింపజేసుకున్న అదృష్ట జాతకుడ్ని.

26.06.1998 నాడు విడుదలైన నా తొలి దర్శకత్వపు చిత్రం ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’కి నిన్నటితో సరిగ్గా 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. తన దివ్యమోహన రూపంతో నన్ను సినిమారంగం వైపు నడిపించిన ‘అన్న’‌ ‘ఎన్టీఆర్’గారికి, నా గురువుగారైన దర్శకేంద్రులు శ్రీ ‘కె. రాఘవేంద్రరావు’గారికి మరియూ నేను సహాయ దర్శకుడిగా పనిచేసిన ఇతర దిగ్దర్శకులైన శ్రీ ‘రామ్ గోపాల్ వర్మ’గారికి, శ్రీ ‘మహేష్ భట్’గారికి, శ్రీ ‘సింగీతం శ్రీనివాసరావు’గారికి, శ్రీ ‘ఉపేంద్ర’గారికి, శ్రీ ‘కృష్ణవంశీ’కి మరియూ గురు సమానులైన స్వర్గీయ ‘వేటూరి’గారికి, శ్రీ ‘సి.అశ్వనీదత్’గారికి మరియూ నా తొలి చిత్రానికి పనిచేసిన ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, స్నేహితులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు, నా చలన చిత్రాలను ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ..

కృతజ్ఞతలతో
మీ
వై వి ఎస్ చౌదరి
26.06.2023.

LegendNTR

LegendANR

AkkineniNagarjuna

YVSChowdary

VenkatBatchu

ChandniJain

Jandhyala

MMK

Sirivennela

AdityaMusic

AnnapurnaStudios

ANRCollege

Gudivada

Venturi

RGVZoomin

MaheshBhatt

SingeethamSrinivasarao

Upendra

KrishnaVamsi

CAshwaniDutt