సురేందర్ కి ఎన్టీఆర్ కౌంటర్ ఇస్తాడా?కామ్ గా ఉంటాడా?

ఇండస్ట్రీలో కొన్ని సార్లు సెలబ్రిటీస్ తెలిసో తెలియకో ఇంటర్వూస్ కి వెళ్లి, ఫ్రాంక్ నెస్ పేరుతో సమాధానాలు చెప్తూ ఇరుక్కుంటూ ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి. సైరా సినిమా తర్వాత పెద్దగా బయటకి రాని సురేందర్ రెడ్డి రీసెంట్ గా ఒక న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో… అతనొక్కడే హిట్ ఇచ్చిన తర్వాత ఎన్టీఆర్ మేనేజర్ తనని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడని ఓపెన్ గా చెప్పి, అందరికీ షాక్ ఇచ్చాడు. కళ్యాణ్ రామ్ కి బ్రేక్ ఇచ్చిన అతనొక్కడే, సురేందర్ రెడ్డికి మొదటి సినిమా. ఫస్ట్ మూవీనే సూపర్ హిట్ ఇవ్వడంతో, సురేందర్ రెడ్డి హాట్ కేక్ లా అయ్యాడు. వేరే హీరోతో, సొంత కథతో రెండో సినిమా చేయాలనుకున్న సురేందర్ రెడ్డి, ఎన్టీఆర్ తో అశోక్ సినిమా చేశాడు.

నిజానికి సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా, ఇంకో హీరోతో చేయాల్సి ఉన్నా కూడా ఎన్టీఆర్ మేనేజర్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంతో… ఎవరో రాసిన కథని డైరెక్ట్ చేయాల్సి వచ్చిందని సురేందర్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది వైరల్ అవ్వడంతో, నందమూరి అభిమానులు సురేందర్ రెడ్డిపై ఫైర్ అవుతున్నారు. “ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంతో అశోక్ సినిమా చేశాను అన్నావు, మరి అదే హీరోతో ఊసరవెల్లి సినిమా ఎలా చేశావు? ఊసరవెల్లి టైములో ఎన్టీఆర్ లాంటి నటుడు లేడు రాడు అనే రేంజులో ఎందుకు మాట్లాడావ్?” అని ఎన్టీఆర్ ఫాన్స్ సురేందర్ రెడ్డిని క్వేషన్ చేస్తున్నారు.

సురేందర్ రెడ్డి తెరకెక్కించిన కిక్ 2 సినిమాని నిర్మించింది కూడా కళ్యాణ్ రామే, ఈ మూవీ ఆడియో లాంచ్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. రవితేజతో తనకున్న జ్ఞాపకాలని చెప్పిన ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి తన ఫ్యామిలీలో వ్యక్తి లాంటి వాడు అన్నాడు. అలాంటి సురేందర్ రెడ్డి, తారక్ గురించి ఇన్నేళ్ల తర్వాత ఇలా కామెంట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం.అశోక్ నుంచి సైరా వరకూ సురేందర్ రెడ్డి ఎన్నో సార్లు మీడియాతో మాట్లాడాడు, ఏ రోజూ ఎన్టీఆర్ గురించి మాట్లాడకుండా ఉన్న వాడు ఈరోజు ఎందుకు మాట్లాడాడు అనేది ఎవరికీ అంతుబట్టని విషయంగా ఉంది. మరి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న ఈ టాపిక్ గురించి ఎన్టీఆర్ ఏమైనా రెస్పాండ్ అవుతాడేమో చూడాలి.