‘ఎఫ్2’తో హిందీకి వెళుతున్న ‘దిల్’ రాజు

f2-hindi-remake

విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ‘దిల్’ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ ‘దిల్’… ఓ ‘ఆర్య’… ‘భద్ర’, ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’, ‘కొత్త బంగారు లోకం’, ‘బృందావనం’, ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎవడు’, ‘కేరింత’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘శతమానం భవతి’, ‘నేను లోకల్’, ‘దువ్వాడ జగన్నాథం – డీజే’, ‘ఫిదా’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎంసీఏ’, ‘ఎఫ్ 2’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన ప్రేక్షకులకు అందించారు.

‘దిల్’ నుంచి ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన ‘ఎఫ్2’ వరకూ ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రాల్లో అత్యధిక శాతం చిత్రాలు విజయాలు సాధిచాయి. హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతల్లో ఆయన ఒకరు. ఎగ్జిబిట‌ర్‌గా, డిస్ట్రిబ్యూట‌ర్‌గా, నిర్మాతగా తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ‘దిల్’ రాజు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన హిందీ పరిశ్రమలో అడుగు పెడుతున్నారు. కుటుంబ కథా చిత్రాలకు వందకోట్ల రూపాయలు వసూలు చేసే సత్తా ఉందని నిరూపించిన ‘ఎఫ్ 2’ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. నిర్మాతగా హిందీలో ‘దిల్’ రాజుకు తొలి చిత్రమిది.

ప్రముఖ తెలుగు నిర్మాత ‘దిల్’ రాజు, ప్రముఖ హిందీ నిర్మాత బోనీ కపూర్ సంయుక్తంగా ‘ఎఫ్ 2’ హిందీ రీమేక్ నిర్మించనున్నారు. హిందీలో అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తారు. ఇంతకు ముందు ఈ దర్శకుడు తెలుగులో విజయవంతమైన ‘రెడీ’ చిత్రాన్ని సల్మాన్ ఖాన్, ఆసిన్ జంటగా అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అలాగే, ‘పెళ్ళాం ఊరెళితే’ చిత్రాన్ని ‘నో ఎంట్రీ’గా రీమేక్ చేశారు. ఇప్పుడు ‘ఎఫ్ 2’ రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.

ఈ సినిమాలో నటించే హీరోలు, ఇతర తారాగణం తదితర వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.