తెరపైకి రజనీకాంత్ బయోపిక్?

ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తెలియనివారు ఎవరూ ఊండరు. బస్ కండక్టర్ నుంచి ఇండియాలోనే టాప్ హీరోగా ఆయన ఎదిగిన తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇండియాలో రజనీకి ఉన్నంత అభిమానులు ఎవరికీ లేరనేది అందరికీ తెలిసిన వాస్తవమే. త్వరలో రాజకీయాల్లోకి కూడా ఆయన అడుగుపెట్టబోతున్నారు.

ఎంతోమందిలో స్ఫూర్తిని నింపిన రజనీకాంత్ జీవితంపై బయోపిక్ సినిమా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ పాత్రను ఆయన అల్లుడు ధనుష్ పోషించనున్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు, రజనీకాంత్ వీరాభిమాని అయిన లింగుస్వామి రజనీ బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నారట.

త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగన్‌గల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్.. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు. వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నాడు. ఇక రజనీ బయోపిక్‌లో ధనుష్ ఎలా నటిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.