మరోసారి గొప్ప మనసు చాటుకున్న ‘డిగ్రీ కాలేజ్’ హీరో!!

క‌రోనా మ‌హ్మ‌మారి కారణంగా ఎందరో ఉపాధి కోల్పోయారు. అలాంటివారిని మరెందరో మానవత్వంతో ముందుకు వచ్చి.. కష్టకాలంలో సాయం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే.. పేద కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్‌ చిరంజీవి సీసీసీ మనకోసం పేరిట ఓ సంస్థను స్థాపించి.. ఇప్పటికే మూడు విడతలు సాయం అందించారు. అలాగే సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులెందరో.. ఈ కరోనా కష్టకాలంలో ముందుకు వచ్చి.. పేదలకు సాయం చేశారు. అందులో ‘డిగ్రీ కాలేజ్’హీరో వరుణ్ కరోనా కష్టకాలం మొదలైనప్పటి నుంచి తనవంతు సహాయం అందిస్తూనే ఉన్నారు.

కాస్త కరోనా ఉదృతి తగ్గి.. పరిస్థితులు ఇప్పడిప్పుడే మెరుగుపడుతున్నాయి. కానీ వరుణ్‌ మాత్రం ఇప్పటికీ సహాయ కార్యక్రమాలు అందిస్తూనే ఉన్నారు. ఈ విపత్తులో ఆయన ఎందరికో నిత్యావసర సరుకులు అందించారు. యూనియన్ కార్డ్‌లేని సినీ ఆర్టిస్ట్ లకు, రోడ్డుపై ఉండే నిరుపేదలకు ఇలా తనకు సాధ్యమైనంతగా సహాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్‌ పరిసరాల్లోని పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్క్, శానిటైజర్స్‌ అందించి మరోసారి తన ఉదాత్త హృదయాన్ని చాటుకున్నారు.