‘రాజధాని ఫైల్స్‌’ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన కోర్ట్

రాజధాని కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు ప్రభుత్వం వల్ల ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు, ప్రజలు రాష్ట్రం కోసం ఎంతగా తపిస్తున్నారు, రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది అనే అంశాలతో రూపొందిన చిత్రం ‘రాజధాని ఫైల్స్‌’. తెలుగు వన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 15న రిలీజ్‌ అవ్వాల్సి ఉంది. అయితే ఈ సినిమా కొందరిని అవమాన పరిచేలా ఉందని, వెంటనే ప్రదర్శనను ఆపాలని ఎపి హైకోర్టులో కేసు వేశారు. దాంతో సినిమా ప్రదర్శన నిలిపి వేయాలంటే కోర్టు స్టే ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సినిమా ప్రదర్శనకు అభ్యంతరం లేదంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. శుక్రవారం ఉదయం నుంచే ‘రాజధాని ఫైల్స్‌’ చిత్రాన్ని అన్ని థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత కంఠంనేని రవిశంకర్‌, దర్శకుడు భాను సినిమాను సపోర్ట్‌ చేస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు సమావేశమయ్యారు.

దర్శకుడు భాను మాట్లాడుతూ ‘‘రాజధాని ఫైల్స్‌ ట్రైలర్‌ ఎంత వేగంగా ప్రజల్లోకి దూసుకెళ్లిందో అందరికీ తెలిసిందే. కోటి యాభై లక్షల మంది ఈ ట్రైలర్‌ని చూసి అప్రిషియేట్‌ చేశారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా అని అందరూ ఎదురు చూశారు. ఫిబ్రవరి 15న మా సినిమా రిలీజ్‌ అయింది. అయితే మొదటి రోజు మొదటి షోకే థియేటర్ల నుంచి ప్రేక్షకులను బయటికి వంపేశారు. కొన్ని చోట్ల 15 నిమిషాలకు, కొన్ని చోట్ల అరగంట, మరికొన్ని థియేటర్లలో ఫస్ట్‌హాఫ్‌ అయిన తర్వాత షో ఆపేసారు. బయటికి వచ్చిన జనం మాకు ఎందుకు చూపించట్లేదు ఈ సినిమాని అని థియేటర్‌ బయటే గొడవ చేశారు, ధర్నాలు చేశారు. ఇందులో మహిళా రైతులు కూడా ఉన్నారు. ఏ ఎమోషన్‌తో అయితే ఈ సినిమాను చూడాలనుకున్నారో దానికి న్యాయస్థానం కూడా సపోర్ట్‌ చేసింది. రైతే రాజు అంటాం. అలా ఓ రాజు లాంటి తీర్పు వచ్చింది. న్యాయం గెలిచింది. రాజధాని కావాలనుకున్న ప్రతి ఒక్కరూ, రైతును గౌరవంచే ప్రతి ఒక్కరూ, రాష్ట్రాన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలి. వచ్చిన రేటింగ్‌ గురించి మీరు పట్టించుకోవద్దు. కొన్ని సినిమాలు సామాజిక బాధ్యతతో వస్తాయి. ఒక సమస్యమీద, ప్రజల సంఘర్షణ మీద వస్తాయి. ఇవి మనం చూడాలి, దాని గురించి తెలుసుకోవాలి, అప్రిషియేట్‌ చెయ్యాలి. అయితే థియేటర్‌లో ప్రేక్షకులు ఉన్నప్పటికీ ఎవరూ లేరని నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నారు. నిజంగా మా సినిమా బాగాలేదు అంటే దాన్ని ఆపాల్సిన అవసరం ఎవరికీ వుండదు. ఎందుకంటే ఇది ఆడే సినిమా కాదని వదిలేసేవారు. ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు, ప్రేక్షకుల్లో మార్పు వస్తుంది. చూసినవారు రాష్ట్రం గురించి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుందనే భయంతోనే ఈ సినిమాను ఆపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. థియేటర్లలో రన్‌ అవుతోంది. మీరందరూ సినిమాని చూసి మేం ఏ పర్పస్‌తో సినిమా చేశామో దానికి అర్థం కల్పిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.

నిర్మాత కంఠంనేని రవిశంకర్‌ మాట్లాడుతూ ‘‘రైతేరాజు, రైతుదే అంతిమ విజయం అని ఈరోజు న్యాయస్థానం రుజువు చేసింది. అహానికి అడ్డుకట్ట వేసి.. నాగలికి న్యాయం చేసింది. మా ‘రాజధాని ఫైల్స్‌’ చిత్రానికి ఉన్న చిన్న అడ్డంకి ఈరోజు తొలగిపోయింది. మమ్మల్ని ఆదరించి, మాకు అండగా నిలిచి రెండు రోజులుగా మాకు ఎంతో ధైర్యాన్నిచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రానికి అఖండ విజయాన్ని చేకూర్చాలని మరోసారి విన్నవించుకుంటున్నాను. రైతులకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపాం. వారిని అన్యాయం చేసిన వారు ఎలా నాశనమవుతారో సినిమాలో చూపించాం. అంతకుమించి ఏ వ్యక్తుల్నీ టార్గెట్‌ చెయ్యాల్సిన అవసరం మాకు లేదు. రైతు జోలికి వెళ్ళకుండా ఉంటే మేం ఈ సినిమా తీసేవాళ్లమే కాదు. ఒక రైతు బిడ్డగా రైతుల కోసం నా వంతు కర్తవ్యంగా భావించి ఈ సినిమా తీశాను. ఈ రెండు రోజులు మాకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ కాంట్రవర్సీ వల్ల మాకు పెట్టుబడి లేని పబ్లిసిటీ వచ్చింది. దానికి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ థియేటర్లకు వెళ్లి ఈ సినిమాని చూడడమే కాదు, చూపించండి.. రైతులకు సంఫీుభావం తెలుపుతూ సినిమాకి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుతున్నాను’’ అన్నారు.