‘పుష్ప’ షూటింగ్‌లో కరోనా కలకలం

ప్రస్తుతం స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సుకుమార్ ‘పుష్ప’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాతే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా.. అల్లు అర్జున్ షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోలను కూడా ఇటీవల ‘పుష్ప’ యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. అయితే పుష్ప సెట్లోని ఒక ప్రొడక్షన్ టీమ్ కార్మికునికి కరోనా సోకి మరణించడంతో షూటింగ్ నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సుకుమార్ అండ్ టీమ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

PUSHPA

ఏపీలోని మారేడుపల్లి అడవుల్లో ఇటీవల షూటింగ్ చేశారు. ఈ సందర్భంగా ప్రొడక్షన్ కార్మికుడు సినిమా యూనిట్‌తో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత కార్మికుడు కరోనాతో చనిపోవడంతో పుష్ప యూనిట్ ఆందోళనకు గురైంది. షూటింగ్‌ను నిలిపివేసి హైదరాబాద్‌కు వచ్చేసినట్లు టాక్ నడుస్తోంది. కరోనాతో మరణించిన వ్యక్తి నేరుగా అల్లు అర్జున్‌కు కలవకపోయినా.. సినిమా యూనిట్‌తో కలిసి పనిచేశాడు.

దీంతో సినిమా యూనిట్ సభ్యులందరూ హైదరాబాద్ తిరిగి వచ్చి కరోనా టెస్టు చేయించుకున్నారని, నిర్మాతలు కూడా టెస్టు చేయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సినిమా యూనిట్ సభ్యులందరూ హోం క్వారంటైన్‌లో ఉన్నారట.