Rajanikanth: వివాదంగా మారిన రజనీకాంత్ కు ఫాల్కే అవార్డు..

Rajanikanth: సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఉంటార‌నే విష‌యం తెలిసిందే. ఆయ‌న తెర‌పై క‌నిపిస్తే ఫ్యాన్స్‌కు పెద్ద పండుగ‌గా భావిస్తారు. ఆయ‌న స్టైల్‌, మేన‌రిజం, డైలాగ్ డెలివ‌రీతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సూప‌ర్‌స్టార్‌గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. కాగా తాజాగా ఆయ‌న‌కు సినీ రంగంలో అత్యున్న‌త పురస్కారం అయినా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా ప‌లు భాష‌ల సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖుల తో పాటు సినీ, ర‌జ‌నీ ఫ్యాన్స్ ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇలా ఆయ‌న‌పై సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు ఫ్యాన్స్ అభినంద‌న‌లు వెల్లువ‌లా వ‌స్తుంటే.. ఆయ‌న‌కు ఆ అవార్డు రావ‌డంపై తాజాగా వివాదంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. ఆయ‌న‌కు ఫాల్కే అవార్డు ప్ర‌క‌ట‌న అభిమానుల్లో ఆనందం రేపింది.. కానీ ప్ర‌క‌టించే స‌మ‌యం, సంద‌ర్భం మాత్రం ప‌రిశీల‌కుల నుంచి ప‌లు విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మయంలో ఆయ‌న‌కు అవార్డు ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు వివాదంగా మారింది.. దీంతో ప‌ద్మ అవార్డులు, జాతీయ అవార్డులు వెనుక రాజ‌కీయాలు ఇలా గ‌త వివాదాల‌పై మ‌ళ్లీ చ‌ర్చ‌లు వాడీ వేడిగా జ‌రుగుతున్నాయి.

Rajanikanth

అయితే ర‌జ‌నీకాంత్ అంటే ప్ర‌ధాని మోదీకి విప‌రీత‌మైన అభిమానం.. అలాగే మంచి మిత్రుడు కూడా.. దీంతో ఆయ‌న‌పై బీజేపీ ముద్ర ఉంది. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో ఆయ‌న రాజకీయ పార్టీని ప్రారంభిస్తాన‌ని అనుకున్నారు, కానీ అన్నాత్తే చిత్ర షూటింగ్ వేళ హైద‌రాబాద్‌లో అస్వ‌స్థ‌త‌కు గురై.. హాస్పిట‌ల్ అడ్మిట్ అయ్యారు.. ఆ త‌ర్వాత రాజ‌కీయ పార్టీపై విర‌మించుకున్నారు. ఇదే ఆస‌ర‌గా తీసుకున్న బీజేపీ త‌మిళ‌నాట ఎలాగైనా జెండా ఎగ‌ర‌వేయాల‌ని రజ‌నీ పార్టీ ద్వారా ప‌రోక్ష రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని ప్ర‌య‌త్నించిన‌ట్లు ప‌రిశీల‌కుల వాద‌న‌. తీరా ర‌జ‌నీ పార్టీ పెట్ట‌లేదు.. అయితే చివ‌రి స‌మ‌యంలో ఈ అవార్డు ప్ర‌క‌ట‌నతోనైనా ఓటింగ్‌లో త‌మిళ ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించుకోవాల‌నే బీజేపీ అనుకుంటున్న‌ట్లు వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అలాగే అస‌లు ర‌జ‌నీ సినీ రంగానికి చేసేందేమిటి? సేవాక‌ర్త‌, దేశం గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుడు, ఇలా ఆయ‌న‌కు మంచి పేరే ఉంది.. కానీ సినీ నిర్మాణం, స్టూడియోల నిర్మాణం, పంపీణీ, ప్ర‌ద‌ర్శ‌న లాంటి శాఖ‌ల‌లో మౌలిక వ‌స‌తుల స‌దుపాయాల క‌ల్ప‌న‌, విస్త్రృతికి ఆయ‌న చేసిందేమిటి? భార‌త సినీ ప‌రిశ్ర‌మ ఎదుగుద‌లలో ఆయ‌న వంతు భాగం ఎంత ఏమిటీ? ఫాల్కే అవార్డు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌స్తావిస్తూ, ప‌లువురు నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. త‌మిళ‌నాట ఎంజీఆర్ త‌ర్వాత అంత‌టి గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు ర‌జ‌నీకాంత్‌. త‌మిళంతో పాటు తెలుగు, హిందీ, ప‌లు భాష‌ల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ర‌జ‌నీ మునుప‌టి త‌రం హీరోలాగా సినిమాలు చేయ‌లేదు.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌, శివాజీ గ‌ణేశ‌న్ లాగా ఏటా అనేక సినిమాలు చేసే ప‌ద్ద‌తికి విరుద్ధంగా.. స్టార్ల్ త‌క్కువ చేసి, ఎక్కువ డ‌బ్బు పొంద‌వ‌చ్చ‌నే ప‌ద్ద‌తి సినీ సీమ‌లో విస్త‌రించ‌డానికి కార‌ణం ఒక‌ర‌కంగా ర‌జ‌నీయే. తెలుగులో చిరంజీవి మొద‌లు క్ర‌మంగా త‌ర్వాత స్టార్లంతా అదే బాట ప‌ట్టారు. దానివ‌ల్ల స్టార్ల పారితోషికం, సినీ వ్యాపారం చుక్క‌ల‌నంటిదేమో కానీ, ఆ మేర‌కు సినీ రంగంలో మ‌రిన్ని చిత్రాల నిర్మాణం, ఉపాధి, విస్త‌ర‌ణ మాత్రం త‌గ్గాయి. రజనీకి అవార్డివ్వడంతో అనేక పాత కథలు మళ్ళీ పైకొచ్చాయి. వాస్తవానికి, కొన్ని పార్టీలు – ప్రభుత్వాలు సొంత ప్రయోజనాల కోసం పాపులర్‌ అవార్డులను వాడుకోవడం ఎప్పుడూ ఉన్నదే! ఒకప్పటి కాంగ్రెస్‌ నుంచి ఇప్పటి బి.జె.పి దాకా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, ఇలాంటి సంఘటనలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. తమిళనాడు సంగతికే వస్తే, రాజకీయ కారణాల రీత్యానే హీరో ఎం.జి.ఆర్‌.కు ఒకప్పుడు జాతీయ ఉత్తమ నటుడంటూ ‘భరత’ అవార్డు ఇచ్చారు. బాక్సాఫీస్‌ హిట్‌ ‘రిక్షాక్కారన్‌’ (1971)లోని రిక్షావాలా పాత్ర, నటన మాటెలా ఉన్నా అప్పట్లో తమిళనాట అధికార డి.ఎం.కె. నుంచి బయటకొచ్చే ప్రయత్నాల్లో ఉన్న ఎం.జి.ఆర్‌.ను ఆకట్టుకొనేందుకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పంచారు. ఆ రోజుల్లో అది పెను వివాదమే రేపింది. జాతీయ పత్రికలు ‘బ్లిట్జ్‌’, ‘లింక్‌’ లాంటివి మొదలు స్థానిక తమిళ పత్రిక ‘దినతంతి’ దాకా అన్నింటా అది చర్చనీయాంశం అయింది. ఒకదశలో ఆ అవార్డును వాపసు ఇచ్చేయాలని ఎం.జి.ఆర్‌. యోచించే దాకా వెళ్ళింది. అలాగే, ఎం.జి.ఆర్‌. చనిపోయిన వెంటనే ఆయనకు ‘భారతరత్న’ ప్రకటించారు. అది మరో వివాదం. 1989లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా రాజీవ్‌ గాంధీ సారథ్యంలోని అప్పటి కేంద్ర ప్రభుత్వం 1988కి ఈ అవార్డు ప్రకటన చేసింది. తమిళనాట రాజకీయ లబ్ధి కోసమే అలా ‘భారతరత్న’ ఇచ్చారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతకు ముందు 1977లో తమిళ శాసనసభ ఎన్నికలుండగా తమిళ నేత కామరాజ్‌కు కూడా 1976లో ఇలాగే మరణానంతర ‘భారతరత్న’ ప్రకటన చేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. తాజాగా మళ్ళీ తమిళనాటే ఎన్నికల వేళలోనే రజనీకాంత్‌ కు ఫాల్కే దక్కడం తాజా వివాదమై కూర్చుంది. తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయని రజనీకాంత్‌ కు ఫాల్కే అవార్డు ఇచ్చారా’ అని విలేఖరుల సమావేశంలో అడిగితే, అవార్డు ప్రకటించిన సాక్షాత్తూ కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రివర్యులు ‘మీరు ప్రశ్న సరిగ్గా వేయండి’ అంటూ రుసరుసలాడడం కొసమెరుపు. మొత్తం మీద ఒక రంగంలో అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా గౌరవార్థం ఇవ్వాల్సిన అవార్డులు, స్వప్రయోజనాల కోసం అవసరార్థం వేసే బిస్కెట్లుగా మారాయని విమర్శ వస్తోంది. పలు విమర్శలకు ప్రభుత్వ పెద్దలు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవార్డు కన్నా ఎక్కువ దాన్ని ప్రకటించిన సమయం, సందర్భం ప్రశ్నార్థకమయ్యాయి. ప్రధాన వార్తలయ్యాయి. అదే విషాదం. ఇక గ‌తంలో ఎవ‌రెవ‌రికి వ‌చ్చింది ఈ అత్యున్న‌త అవార్డు.. భార‌తీయ సినీ పితామ‌హుడైన దాదా సాహెబ్ ఫాల్కే పేరు మీద 1969లో ఈ అవార్డును నెల‌కొల్పారు. ఫాల్కే అవార్డు ద‌క్కిన 51వ సినీ ప్ర‌ముఖుడు ర‌జ‌నీకాంత్‌.. 2019సంవ‌త్సారానికి గాను ర‌జ‌నీకి ఈ అవార్డు ప్ర‌క‌టించింది. ఇక తెలుగు విష‌యానికొస్తే.. బి.ఎన్‌.రెడ్డి, పైడి జైరాజ్‌, ఎల్వీ ప్ర‌సాద్‌, నాగిరెడ్డి, అక్కినేని, రామానాయుడు, కె.విశ్వ‌నాథ్‌లు ఈ అవార్డు గ్ర‌హీత‌ల్లో ఉన్నారు. అయితే రాజకీయ కార‌ణాల వ‌ల్ల ఎంజీఆర్‌కు మ‌ర‌ణానంత‌రం భార‌త‌ర‌త్న ఇచ్చిన ప్ర‌భుత్వాలు మ‌న తెలుగు ర‌త్నాలు ఎన్టీఆర్‌, పివి న‌ర‌సింహారావుల‌ను ఇప్ప‌టికీ గుర్తించ‌డ‌మే లేదు. గంధ‌ర్వ గాయ‌ని ఎంఎస్ సుబ్బుల‌క్ష్మికి ఇచ్చిన భార‌త‌ర‌త్న‌.. మ‌న వాగ్గేయ‌కారుడు మంగ‌ళంప‌ల్లి బాల‌ముర‌ళికృష్ణ‌కు రాలేదు. ల‌తా మంగేష్క‌ర్‌, ఆశా భోంస్లేల‌కు ద‌క్కినంత జాతీయ గౌర‌వం మ‌న గాన కోయిల‌లు సుశీల‌, జాన‌కిల‌కు ల‌భించ‌లేదు. ఏ అవార్డులు ప్ర‌క‌టించినా దాదాపు ప్ర‌తిసారీ తెలుగువారి విష‌యంలో ఇదే పరిస్థితి.. ఉత్త‌రాది, ద‌క్షిణాది వివ‌క్ష కూడా దీనికి ఒక కార‌ణ‌మ‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.