మెగాస్టార్ కనిపిస్తే చాలు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు

ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా కోసం పది కేజీల బరువు తగ్గి కొత్తగా కనిపిస్తున్నాడు. ఇదే రూట్ లో వెళ్తూ మెగాస్టార్ చిరు కూడా జిమ్ లో కష్టపడుతున్నాడు. సైరా కోసం కూడా జిమ్ బాటపట్టి వారియర్ లుక్ లో కనిపించి మెప్పించిన చిరు, ఈసారి కొరటాల శివ సినిమాలో షాక్ ఇచ్చే రేంజులో కనిపించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన ఈ ప్రాజెక్ట్ త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీలో రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లనుంది.

కొరటాల శివ, తన హీరోలని చూపించే విధానంలో కొత్తదనం చూపిస్తూ ఉంటాడు. చిరుని కూడా అలానే చుపించాలనుకున్న కొరటాల… ఒకప్పటి మెగాస్టార్ ని, గత దశాబ్దమున్నరగా మిస్ అవుతున్న మెగాస్టార్ ని చూపించడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా కోసం చిరంజీవి జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అది చూసిన మెగా అభిమానులు, చిరు డెడికేషన్ ని మెచ్చుకుంటూ ఉంటే కొంతమంది మాత్రం తెరపై మెగాస్టార్ కనిపిస్తే చాలు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానుల అభిప్రాయాలు ఎలా ఉన్నా ఆరుపదులు దాటిన వయసులో ఆయన సినిమా కోసం పడుతున్న కష్టమే చిరంజీవిని మెగాస్టార్ ని చేసింది అనేది మాత్రం నిజం.