టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రజనీకాంత్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని, ఇచ్చే వరకు తెలుగు ప్రజలు అడుగుతూనే ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ‘‘భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ఒక వ్యక్తి కాదు.. శక్తి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ స్ఫూర్తి ఉంటుంది. పది కోట్ల మంది తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌కు ఘన నివాళి అర్పించాలి. ఎన్టీఆర్ అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు. దేశ రాజకీయాల్లో మార్పు తేవాలని సంకల్పించారు. తెలుగుజాతి అవమానాలకు గురవుతోందని బాధపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.*
భారత రత్న ఇచ్చే వరకు తెలుగు జాతి పోరాడుతూనే ఉంటుంది. ఎన్టీఆర్ స్ఫూర్తి.. తెలుగు జాతిలో శాశ్వతంగా ఉండాలి. ఆయన వారసుడిగా వచ్చిన బాలకృష్ణ.. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని సేవా భావంతో నడిపిస్తున్నారని చంద్రబాబు అభినందించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రజనీకాంత్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మంచి మానవత్వం ఉన్న వ్యక్తి రజనీకాంత్ అని, ఆయనకు జపాన్‌లో కూడా అభిమానులున్నారని తెలిపారు. సినిమా చిత్రీకరణను రద్దు చేసుకుని ఉత్సవాలకు వచ్చారని అన్నారు. ఒక నాయకుడు మరో నాయకుడిని ఎలా ప్రభావితం చేశారో రజనీకాంత్ చెప్పారని పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
*చంద్రబాబు నివాసానికి రజినీకాంత్ : ఎన్టీఆర్ అసెంబ్లీ, చారిత్రిక ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనేందుకు అమరావతి వచ్చిన అగ్ర నటులు రజనీ కాంత్ ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తేనీటి విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ఉండవల్లిలోని నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చారు. రజనీ కాంత్ కి టీడీపీ అధినేత సాదర స్వాగతం పలికారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి రజినీకాంత్ వెళ్లారు. ఈ సందర్భంగా రజినీకాంత్, ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు చంద్రబాబు తేనీటి విందు ఇచ్చారు. అనంతరం చంద్రబాబు నివాసం నుంచి నేరుగా అనుమోలు గార్డెన్స్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో చంద్రబాబు, రజినీకాంత్, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై రెండు పుస్తకాలు విడుదల చేశారు.
ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని, ఆయనపై అభిమానాన్ని గుర్తు చేసుకున్న తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎన్టీఆర్ యుగపురుషుడు అని కొనియాడారు. తన జీవితంలో ఆనందంతో ఎగిరి గంతేసిన క్షణాలు రెండు సార్లు మాత్రమే అయితే.. అందులో మొదటిది ఎన్టీఆర్ భారీ విజయంతో ముఖ్యమంత్రి కావడం, రెండోది.. హిమాలయ పర్వతాలను ప్రత్యక్షంగా చూడడం అని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల అంకురార్పణ సభకు రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన తీరు.. అటు తెలుగు దేశం శ్రేణులను, ఎన్టీఆర్ అభిమానులను ఎంతగానో ఆకర్షించింది.. ఆలోచింపజేసింది.
ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ… ఎన్టీఆర్ ప్రభావం తనపై ఎంతో ఉందని చెప్పారు. తాను ఆరేడేళ్ల వయసులో చూసిన తొలి సినిమా పాతాళభైరవి అని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ‘లవకుశ’ సినిమా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఎన్టీఆర్‌ను చూశానని, శ్రీకృష్ణ పాండవీయంలో ఎన్టీఆర్‌ను చూసి మైమరిచిపోయానని తెలిపారు. కండక్టర్ అయ్యాక ఎన్టీఆర్‌ను అనుకరిస్తుంటే.. సన్నిహితులు సినీరంగంలోకి రావాలని ప్రోత్సహించారని వెల్లడించారు. 1977లో టైగర్ చిత్రంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించానని, సినిమాలోనే కాకుండా బయట కూడా మంచి ఎన్టీఆర్‌ది గొప్ప వ్యక్తిత్వమని రజనీకాంత్ కొనియాడారు. ఎన్టీఆర్ బహుముఖ పాత్ర పోషించి నటించిన దానవీరశూరకర్ణ చూసి… అదే పాత్రలో నటించాలనుకున్నానని చెప్పిన రజనీ… స్వయంగా ఎన్టీఆర్ మేకప్‌మ్యాన్ వచ్చి తనకు తిలకం దిద్దినా.. ఆ వేషం తనకు సెట్ కాలేదని సన్నిహితుడు చెప్పినట్లు వెల్లడించారు.చంద్రబాబు విజన్ ఆంధ్రప్రదేశ్‌కు వెలుగు రేఖ.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజన్ గురించే ఆలోచిస్తారని తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. సభను చూస్తే రాజకీయాలు మాట్లాడాలనిపిస్తోందని… కానీ, అనుభవం రాజకీయాలు మాట్లాడవద్దని హెచ్చరిస్తోందని చెప్పారు. కానీ ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గురించైనా రాజకీయం మాట్లాడక తప్పడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు గురించి రాజకీయం మాట్లాడకుంటే అది నాగరికం కాదన్నారు. 4నెలల క్రితం చంద్రబాబు ని కలిస్తే విజన్ 2047గురించి చెప్పారని… అది సాకారమైతే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎక్కడికో వెళ్లిపోతుందని అన్నారు. చంద్రబాబు విజన్ 2047 నెరవేరాలని, ఆశక్తి భగవంతుడు ఆయనకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచ రాజకీయాలు తెలిసిన నేత చంద్రబాబు అని కొనియాడారు. పరిపాలనలో చంద్రబాబు దూరదృష్టి ఏంటో ఇక్కడి వారికి తెలియకపోవచ్చు కానీ దేశంలోని పెద్ద పెద్ద రాజకీయ నేతలకంతా తెలుసని చెప్పారు. ఆయన ఎప్పుడూ అభివృద్ధి గురించే మాట్లాడేవారని గుర్తుచేశారు. హైదరాబాదులో సైబరాబాద్ వైపు ఓసారి వెళ్లాను.. ఇండియాలో ఉన్నానా..? న్యూయార్క్ లో ఉన్నానా అని అనిపించిందన్నారు. హైదరబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉందని చెప్పారు. బాలయ్యను తన తమ్ముడిగా రజనీకాంత్ అభివర్ణించారు. బాలయ్యలో ఎన్టీఆరును చూస్తున్నానన్న రజనీకాంత్. ఆయన ఏం చేసినా జనం చూస్తారని చెప్పారు. బాలయ్యకు కోపం ఎక్కువ.. కానీ మనస్సు వెన్న అని కొనియాడారు.