విచారణకి రాలేను, పర్మిషన్ ఇవ్వండి

బాలీవుడ్ డ్రగ్ స్కాండల్ లో చిక్కుకున్న టాలెంట్ మేనేజర్ జయ సహా చాటింగ్ లిస్టులో దీపికా పదుకోనేతో పాటు ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాష్ పేర్లు ఉండటంతో వాళ్ళిద్దరికీ సమన్లు జారీ చేసి ఇంటరాగేట్ చేస్తామని ఎన్సీబీ తెలిపింది. కరిష్మాకు సమన్లు జారీ చేయగా… తనకు అనారోగ్యంగా ఉందనీ, ఈ నెల 25 వరకూ దర్యాప్తు నుండి మినహాయింపు ఇవ్వమని ఆమె కోరిందని ఎఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. దీపికా పదుకోనేకు కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) త్వరలో సమన్లు జారీ చేయడం, ఇంటరాగేషన్ చేయడం ఖాయంగానే కనిపిస్తుంది.

నిజానికి ఇప్పటికే దీపికాకి సమన్లు జారీ చేయాల్సి ఉండగా ముందుగా ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాష్‌ను ఇంటరాగేట్ చేసి, ఆ తరవాత దీపికను ఇంటరాగేట్ చేయాలని నార్కోటిక్స్ బ్యూరో అనుకుంటున్నారట. ప్రస్తుతం దీపికా పడుకోనే, షకున్ బత్రా దర్శకత్వంలో నటిస్తున్న సినిమా చిత్రీకరణ కోసం గోవా వెళ్లారు. ఓ వారం క్రితమే సినిమా మొదలైంది. కరిష్మా కూడా ఆమెతో ఉన్నట్టు సమాచారం. అందువల్ల, ఎన్సీబీ విచారణకు వెంటనే హాజరు కావడం ఆమెకు సాధ్యం కాకపోవచ్చని ముంబై వర్గాలు వ్యాఖ్యానించాయి. మరోవైపు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 6 వరకు కోర్టు పొడిగించింది.