భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ సెట్‌

ప్యాన్‌ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ద‌ర్శక‌ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఛత్రపతి’. 2005లో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించి స్ట‌న్నింగ్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ‘బాహుబలి’ కంటే ముందు ప్రభాస్‌ను ఛత్రపతి శివాజీగా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో చూపించి ప్రేక్షకులను మెస్మ‌రైజ్ చేశారు రాజమౌళి. ఈ మూవీ వీరిద్ద‌రి కెరీర్స్‌ని మ‌రో స్థాయికి తీసుకెళ్లింది.

బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఛత్రపతి’ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్‌ కానుంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్ ప‌తాకంపై డా. జ‌యంతిలాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అల్లుడు శీను’, ‘జయ జానకి నాయక’, ‘సాక్ష్యం’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులో నటుడిగా తనదైన ముద్ర వేసిన యంగ్‌ అండ్‌ ప్రామిసింగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ‘ఛత్రపతి’ చిత్రం హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను ‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకులు వీవీ వినాయక్ ఈ మూవీతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హిందీ చిత్ర పరిశ్రమకు కూడా హీరోగా పరిచయం చేస్తుండ‌టం విశేషం. తెలుగు ‘ఛత్రపతి’ చిత్రానికి కథ అందించిన రాజమౌళి తండ్రి, ప్రముఖ దర్శక–రచయిత కేవీ విజయేంద్రప్రసాద్ హిందీ ‘ఛత్రపతి’ రీమేక్‌కు స్క్రిప్ట్‌ అందిస్తున్నారు. ఇక ‘ఆది, ఠాగూర్, ఖైదీ నంబరు 150’ వంటి విజయవంతమైన చిత్రాలతో దర్శకునిగా వి.వి.వినాయక్‌ ఎంత గొప్ప పేరు సంపాదించారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ షూటింగ్‌ను ఏప్రిల్‌ 22న మొదలు పెట్టాలనుకున్నారు. ఇందుకోసం 3 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆరు ఏకరాల్లో ఆర్ట్‌ డైరెక్టర్‌ సునీల్‌బాబు ఓ విలేజ్‌ సెట్‌ను ఏర్పాటు చేశారు. ‘రంగస్థలం’ విలేజ్‌ సెట్‌ను కూడా అప్పట్లో ఇదే లొకేషన్‌లో క్రియేట్‌ చేశారు. దురదృష్టవశాత్తు కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు, లాక్‌డౌన్‌ వంటి కారణాలతో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ షూటింగ్‌ను అనుకున్న సమ యానికి ప్రారంభించలేకపోయారు. ఈ లోపు 3కోట్ల రూపాయలతో వేసిన సెట్‌ ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల తాకిడికి తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఈ సెట్‌ను పునరుద్దరించే పనిలో పడ్డారు ఆర్ట్‌ డైరెక్టర్‌ సునీల్‌ బాబు అండ్‌ కో. ఈ సెట్‌ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించ‌నున్నారు మేక‌ర్స్‌.

భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సరికొత్త అవతారంలో కనిపించ నున్నారు. ఈ సినిమా టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్రయూనిట్‌ పేర్కొంది.