బనారస్ అలరించే డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్

చిత్రం: బనారస్
నటీనటులు : జైద్ ఖాన్, సోనాల్ మాంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్నా రాజ్, బర్కత్ అలీ తదితరులు
విడుదల తేదీ: నవంబర్ 4, 2022
మాటలు : రఘు నిడువల్లి
ఛాయాగ్రహణం : అద్వైత గురుమూర్తి
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్!
నిర్మాత : తిలక్ రాజ్ బల్లాల్!
తెలుగులో విడుదల : ‘నాంది’ ఫేమ్ సతీష్ వర్మ
రచన, దర్శకత్వం : జయతీర్థ

కథ:

ధని (సోనాల్ మాంటెరో) సింగింగ్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తోంది. ఓ పందెంలో నెగ్గడం కోసం ఆమెకు సిద్ధార్థ్ (జైద్ ఖాన్) దగ్గర అవుతాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో సిద్దార్థ్ సన్నిహితంగా ఫోటో దిగుతాడు. స్నేహితుడు వల్ల ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధని క్యారెక్టర్ మీద కామెంట్స్, ట్రోల్స్ వస్తాయి. హైదరాబాద్ వదిలేసి ‘బనారస్’ లోని బాబాయ్ ఇంటికి వెళుతుంది ధని. తాను చేసింది తప్పని గ్రహించి ఆమెకు సారీ చెప్పడానికి సిద్ధార్థ్ వెళతాడు. ఆ తర్వాత ఏమైంది? టైమ్ ట్రావెల్ / టైమ్ లూప్‌లో సిద్ధార్థ్ ఎలా పడ్డాడు? అనేది బనారస్ సినిమా

నటీనటుల పనితీరు :

హీరోగా జైద్ ఖాన్ తొలి సినిమా నే అయినా చాల మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. తెర మీద హ్యాండ్సమ్‌గా కనిపించారు. ఎమోషన్స్‌ కూడా చక్కగా చూపించారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ‘తొలి తొలి వలపే…’ పాటలో హీరోయిన్ సోనాల్ మాంటెరో గ్లామరస్‌గా కనిపించారు. తన పాత్రకి తగ్గట్టు నటనతో ఆకట్టుకుంటారు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. జైద్, సోనాల్ జోడీ బావుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. హీరో తండ్రిగా కనిపించిన దేవరాజ్, హీరోయిన్ బాబాయ్ పాత్ర చేసిన అచ్యుత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటులే కావడంతో ఫెమిలియారిటీ వచ్చింది . క్లైమాక్స్ లో సుజయ్ శాస్త్రి నటన బావుంది. ఫిలాసఫీ చెప్పడం కోసం క్లైమాక్స్ సాగదీసినట్టు ఉంటుంది.

సాంకేతిక నిపుణుల పనితీరు:

ఫిలాసఫీ చెప్పడానికి బనారస్ (కాశీ) నేపథ్యాన్ని దర్శకుడు జయతీర్థ ఎంపిక చేసుకున్నారు. తెరపై కొత్త ప్రపంచాన్ని చూపించడానికి కాశీని చక్కగా ఉపయోగించుకున్నారు. టైమ్ ట్రావెల్ / లూప్ కాన్సెప్ట్‌కు ఆయన డిఫరెంట్ టచ్ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి ఆకట్టుకున్నారు. విజువల్స్ బావున్నాయి. ‘తొలి తొలి వలపే…’ పాటను రొమాంటిక్‌గా చిత్రీకరించారు. కాశీ గంగలో చిత్రీకరించిన ‘కన్ను తెరిచిన పాట… కన్నతల్లిది జోలపాట’లో విజువల్స్, కాసర్ల శ్యామ్ సాహిత్యం గుర్తుంటాయి. బి అజనీష్ లోక్‌నాథ్ మంచి పాటలు, నేపధ్య సంగీతం అందించారు. నిర్మాణ విలువలు లావిష్ గా బాగున్నాయి.

విశ్లేషణ :

సినిమా స్టార్టింగ్ మామూలుగానే ఉంటుంది. హీరో హీరోయిన్స్ ఫోటో వైరల్ కావడం, దానికి ముందు హీరో స్నేహితులతో కలిసి విదేశాలు వెళ్లడం సాధారణ కథలానే అనిపిస్తుంది. కథ కాశీకి షిఫ్ట్ అయిన తర్వాత విజువల్స్, పాటలతో సినిమా మరో స్థాయికి వెళుతుంది. సెకండాఫ్ లో మరో ప్రపంచంలోకి తీసుకు వెళ్లారు. టైమ్ ట్రావెల్, టైమ్ లూప్ కాన్సెప్ట్ లతో సర్‌ప్రైజ్ చేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్, కథలో చెప్పిన ఫిలాసఫీ, మలుపులు ఆసక్తిగా ఉన్నాయి . ట్విస్ట్ రివీల్ అయ్యాక మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే ఇంకాస్త బాగుండేది. సాధారణ ప్రేమకథగా మొదలైన ‘బనారస్’ అనూహ్యమైన మలుపులు తిరుగుతూ… ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తూ… చివరకు ఓ హ్యాపీ నోట్‌లో ఎండ్ అవుతుంది.

‘బనారస్’ ఫస్టాఫ్ క్యూట్ అండ్ మ్యూజికల్ లవ్ స్టోరీ అయితే… సెకండాఫ్ థ్రిల్లింగ్ టైమ్ ట్రావెల్ / లూప్ ఎంటర్‌టైనర్. మంచి పాటలు, విజువల్స్, ఎమోషన్స్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ తో సెకండాఫ్‌లో ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్ తో ఆద్యంతం అలరించేలా ఉంది.

చివరగా: అలరించే డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్