‘అస‌లేం జ‌రిగింది’? సినిమాకు పెరుగుతున్న ఆద‌ర‌ణ!!

అస‌లేం జ‌రిగింది? సినిమాకు మంచి మౌత్ టాక్ రావ‌డంతో రెండో వారం మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. రెండో వారంలో హైద‌రాబాద్‌లో రెండు థియేట‌ర్ల‌లో ఈ సినిమా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. మంగ‌ళ‌వారం నుంచి గ‌చ్చిబౌలిలోని ప్లాటినం మూవీస్‌లో అద‌నంగా రెండు షోలను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఎల్‌బీన‌గ‌ర్‌లోని బీవీఆర్ మ‌ల్టిప్లెక్స్ థియేట‌ర్ సోమ‌వారం ఫ‌స్ట్ షో దాదాపు 75 శాతం నిండిపోయింది. మూవీ క‌లెక్ష‌న్ ఎంత‌లేద‌న్నా 25 వేల‌కు చేరుకుందని స‌మాచారం. అదేవిధంగా, పీవీఆర్ ప్రెస్ట‌న్ మ‌ల్టీప్లెక్స్ కూడా సుమారు అర‌వై శాతం నిండిపోయింది. ఈ థియేట‌ర్లో కూడా క‌లెక్ష‌న్ రూ.20 వేలు దాటేసింది. ఇంత మంచి రెస్పాన్స్ రావ‌డంతో.. మంగ‌ళ‌వారం నుంచి గ‌చ్చిబౌలిలో ప్లాటినం థియేట‌ర్లో రెండు షోల‌ను పెంచారు. దీపావ‌ళి త‌ర్వాత మ‌రిన్ని థియేట‌ర్ల‌లో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత చెబుతున్నారు.

మొత్తానికి, అక్టోబ‌రు 22న విడుద‌లైన సినిమాల్లో కేవ‌లం అస‌లేం జరిగింది మాత్ర‌మే సెకండ్ వీక్‌కి వ‌చ్చింది. దీంతో, ప‌లువురు బి మ‌రియు సి సెంట‌ర్ల‌లో సినిమాను విడుద‌ల చేసేందుకు ముందుకొస్తున్నారు. మొత్తానికి, విభిన్న‌మైన క‌థాంశంతో విడుద‌లైన అస‌లేం జ‌రిగింది? సినిమాలో పాట‌లు హైలెట్ కావ‌డం, విల‌న్ రోల్ ఎక్కువ మందికి న‌చ్చ‌డం, ఇంట‌ర్వెల్ త‌ర్వాత సినిమా ఒక రేంజ్‌కి వెళ్ల‌డం వంటి అంశాల వ‌ల్ల సినిమాకు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈ విజ‌యంతో సినీ నిర్మాత మ‌రో రెండు, మూడు సినిమాల‌ను తీసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. అతిత్వ‌ర‌లో వాటి వివ‌రాల్ని తెలుస్తాయ‌ని నిర్మాతలు అంటున్నారు.