సౌత్ సీనియర్ డైరెక్టర్ మణికందన్, సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఒక సినిమా దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నాడు. ఇదివరకే విద్యాబాలన్ బాలీవుడ్ లో డర్టీ పిక్చర్ ద్వారా సిల్క్ స్మిత జీవితంపై ఒక సినిమా తీశారు. ఇక ఇప్పుడు సౌత్ నుంచి రానుంది. అవల్ అప్పడితన్ పేరుతో ఈ ప్రాజెక్టును గాయత్రి ఫిల్మ్స్, మురళి సినీ ఆర్ట్స్ నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తారు.
నవంబర్ మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నెల చివరి నాటికి ఈ చిత్రంలోని తారాగణం అలాగే టెక్నీషియన్ సభ్యులను ప్రకటించాలని చూస్తున్నారు. ఇక దర్శకుడు ప్రస్తుతం సిల్క్ పాత్రను పోషించడానికి, పాత్రకు న్యాయం చేయగల నటి కోసం వెతికే పనిలో బిజీగా ఉన్నాడు. 1980 నుంచి 1990 వరకు ఆమె ఎంతగానో క్రేజ్ అందుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన సిల్క్ స్మిత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలతో సహా వివిధ భాషలలో 450 కి పైగా సినిమాలు చేసింది. సెప్టెంబర్ 23, 1996 న, సిల్క్ స్మిత చెన్నైలోని తన అపార్ట్మెంట్లో చనిపోయారు. వ్యక్తిగత సమస్యల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు అప్పటి విచారణలో తెలినప్పటికి అనేక అనుమానాల నడుమ ఆమె మరణం ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది.