య‌ష్ ‘టాక్సిక్’ చిత్రంలో నటించనున్న అమెరిక‌న్ న‌టుడు

రాకింగ్ స్టార్ య‌ష్..  లేటెస్ట్ సెన్సేష‌న‌ల్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ గురించి అమెరికన్ నటుడు కైల్ పాల్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇందులో ఆయ‌న ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు.  దీని గురించి కైల్ పాల్ స్పందిస్తూ ‘‘నేను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల్లో  ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో నాకు క‌లిగిన ఎక్స్‌పీరియెన్స్ బెస్ట్ అని చెబుతాను’’ అన్నారు భాష ప‌రంగా తన‌కు తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికీ సినిమా సెట్స్‌లోకి అడుగు పెట్టిన వివ‌రాల‌ను ఆయ‌న వివ‌రించారు. ‘తెలియ‌ని భాష‌లో భావోద్వేగ స‌న్నివేశాల్లో న‌టించ‌టం అనేది ఎంతో స‌వాలుతో కూడుకున్నది. కానీ ఆ వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను మ‌ర‌చిపోలేను’ అని పాల్ వెల్లడించారు.

‘‘నేను ఇండియాలో టాక్సిక్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఓ గొప్ప అనుభ‌వాన్ని పొందాను. ఆరోజు ఉద‌యం మూడు గంట‌ల‌కు షూటింగ్ చేస్తున్నాం. అదొక భావోద్వేగ స‌న్నివేశం. అలాంటి సన్నివేశంలో నేను క‌న్న‌డ‌లో మాట్లాడాలి. ఆ ప‌దాల‌ను తార్కికంగా ఆలోచిస్తూ భావోద్వేగంలో ఉండాలి. కానీ నేను తార్కికంగా ఆలోచించ‌లేక‌పోయాను. కాబ‌ట్టి భావోద్వేగాన్ని గొప్ప‌గా స‌న్నివేశంలో ప‌లికించ‌లేక‌పోయాను’’ అని తెలిపారు పాల్.

అయితే న‌టుడిగా పాల్‌కు ఆ క్ష‌ణం ఎంతగానో గుర్తుండిపోయింది. అందుకు కార‌ణం డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్ నుంచి ఆయ‌న‌కు ల‌భించిన మ‌ద్ద‌తు. ‘డైరెక్టర్ గీతు అద్భుతమైన వ్యక్తి. నేను సన్నివేశాన్ని పూర్తి చేయటానికి చాలా సమయం తీసుకున్నప్పటికీ ఆమె స‌హ‌కారాన్ని అందించింది. మీరు ఈ స‌న్నివేశంలో బాగా న‌టించ‌గ‌ల‌రు. ప్ర‌య‌త్నించండి.. కావాలంటే ఇంకా స‌మ‌యం తీసుకోండి అని న‌న్నెంత‌గానో ఉత్సాహ‌ప‌రిచారు. ఇది న‌టుడిగా నేను ఎదుర్కొన్న గొప్ప అనుభ‌వం. నాకు ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు కైల్ పాల్.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న టాక్సిక్ చిత్రం క‌న్న‌డ చిత్ర‌సీమ పేరుని మ‌రో అడుగు ముందుకు తీసుకెళ్ల‌టానికి వేస్తోన్న ధైర్య‌మైన అడుగుగా ప్ర‌స్తావించ‌వ‌చ్చు. ఆడియెన్స్‌కి సినిమాటిక్ విజువ‌ల్ ఎక్స్‌పీరియెన్స్ అందించ‌నుంది. క‌న్న‌డ‌, ఇంగ్లీష్‌లో రూపొందిస్తోన్న తొలి భారీ చిత్రంగా టాక్సిక్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మ‌న భార‌తీయ క‌థ‌నానికి, అంత‌ర్జాతీయ ప్రేక్ష‌కుల మ‌ధ్య వార‌ధిగా ఈ చిత్రం నిలుస్తుంది. గొప్ప సంస్కృతి క‌లిగిన క‌న్నడ చిత్ర‌సీమ‌ను మ‌న ఇండియ‌న్ సినీ ప్రేక్ష‌కుల‌కు ఓ స‌రికొత్త ప్రామాణిక‌త‌ను నిర్దారిస్తూ ముందుకు తీసుకెళ్ల‌టానికి ఈ చిత్రం కేంద్ర‌బిందువుగా మారుతుంది. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ, మ‌లయాళ భాష‌లు స‌హా ప‌లు భార‌తీయ‌, అంత‌ర్జాతీయ భాష‌ల్లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

కె.వి.ఎన్‌.ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై వెంక‌ట్ కె.నారాయ‌ణ‌, య‌ష్ నిర్మిస్తోన్న  ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ చిత్రం యాక్ష‌న్ జోన‌ర్‌కి ఓ స‌రికొత్త  నిర్వ‌చనాన్ని చెప్ప‌నుంది.