టాప్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ గా అంతర్జాతీయ గుర్తింపు సంపాదించుకున్న మ్యాగజైన్ ప్రొవోక్. ఫిబ్రవరి నెలకు గాను మ్యాగజైన్ కవర్ ఫొటోగా టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ది వేయడం విశేషం. దీనికోసం ప్రత్యేకంగా ఫొటోషూట్ చేశారు. స్టైలిష్ లుక్స్ తో అల్లు శిరీష్ కొత్తగా కనిపించాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫొటోషూట్ చేశారు. గుర్తింపు పొందిన లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కావడం, అల్లు శిరీష్ ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ ఫొటోషూట్ ని విభిన్నంగా అల్ట్రామోడ్రన్ కాన్సెప్ట్ తో ప్లాన్ చేశారు. ఇగ్నైట్, ఇన్నోవేట్, ఇన్ స్పైర్ ట్యాగ్ లైన్స్ గా నడుస్తున్న ఈ మ్యాగజైన్ కోసం అల్లు శిరీష్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓ టాలీవుడ్ స్టార్ కి దక్కిన గౌరవంగా ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్లు శిరీష్ సైతం ప్రొవోక్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ పై కవర్ ఫొటో రావడంతో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కవర్ ఫోటో కోసం తనను ఎంపిక చేసుకోవడం ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు.
అల్లు శిరీష్ తాజాగా నటిస్తున్న చిత్రం ఎబిసిడీ. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే హిందీ శాటిలైట్ డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడైన విషయం తెలిసిందే. సీనియర్ నిర్మాత డి.సురేష్ బాబు ఈ చిత్రానికి సమర్ఫకులుగా వ్యవహరిస్తుండడం విశేషం. ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు ఇందులో అల్లు శిరీష్ కు తండ్రి పాత్రలో నటించారు. బాలనటుడిగా మనకు సుపరిచితమైన భరత్ ఇందులో హీరో ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నాడు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్.
సంజీవ్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. బిగ్ బెన్ సినిమాస్ యశ్ రంగినేని తో కలిసి మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో మధుర శ్రీధర్ ఈ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.