సీనియర్ జర్నలిస్ట్ ‘భగీరథ’ కు అక్కినేని జీవనసాఫల్య పురస్కారం !!

అక్కినేని నాగేశ్వర రావు జీవితం తనకు ఎంతో స్ఫూర్తి నిచ్చిందని , జర్నలిస్టు గా మాత్రమే కాకుండా తనని కుటుంబ సభ్యుడుగా చూసేవారని సీనియర్ జర్నలిస్ట్ భగీరథ పేర్కొన్నారు .


పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వర రావు 98వ జయంతి సందర్భంగా శృతిలయ ఆర్ట్స్ అకాడమీ మరియు సీల్ వెల్ కార్పొరేషన్
ఏర్పాటుచేసిన అక్కినేని జీవనసాఫల్య పురస్కారాన్ని ఈ సంవత్సరం సీనియర్ జర్నలిస్ట్ , రచయిత , కవి భగీరధకు ప్రదానం చేశారు .
హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో భగీరధను ఘనంగా సత్కరించి అవార్డు ప్రదానం చేశారు .


ఈ సందర్భగా భగీరథ మాట్లాడుతూ . అక్కినేని నాగేశ్వర రావు గారితో 1977 నుంచి పరిచయం ఉందని , ఆయన తనని ఎంతో ఆత్మీయంగా చూసేవారని, వారి ప్రోత్సాహంతోనే సినిమా రంగంలో గుర్తింపు , గౌరవం సంపాదించానని చెప్పారు , అక్కినేనితో తనకు ఎన్నో మధుర స్మృతులున్నాయని , ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి జయంతి వేడుకలను నిర్వహించిన ఆమని, భండారు సుబ్బారావు ,భీం రెడ్డి , అనూహ్యా రెడ్డి , మహమ్మద్ రఫీ ని ఈ సందర్భగా భగీరథ అభినందించారు .


మహనీయుల జీవితాలను పాఠాలుగా భావించి ఆచరించినప్పుడు జీవితంలో ఎవరైనా లక్ష్యాలను చేరుకుంటారని , తెలుగు సినిమా తో పాటే అక్కినేని నాగేశ్వర రావు కూడా ఎదిగి అనూహ్యమైన విజయాలు సాధించాడని, అందుకే ఎన్ని తరాలైనా ఆయన ప్రజల హృదయాల్లో చిరంజీవిగా మిగిలిపోతారని భగీరథ చెప్పారు .
ఈ సభలో యువ నటుడు ఉదయ్ శంకర్ ను అక్కినేని యువ నట పురస్కారంతో సత్కరించారు . ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న పలువురు పాత్రికేయులకు శృతిలయ ఉత్తమ పాత్రికేయ అవార్డులను ప్రదానం చేశారు . అవార్డులు స్వీకరించిన పాత్రికేయులకు , శృతిలయ వారికి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు .


ఈ సభకు ఓలేటి పార్వతీశం అధ్యక్షత వహించారు . తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలాచారి ముఖ్య అతిధిగా వచ్చారు .