భారీ రేటుకు అజిత్ సినిమా రైట్స్

సినిమాకు భాషతో సంబంధం ఉండదు. ఏ భాష సినిమా అయినా మిగతా భాషల వాళ్లు కూడా చూస్తారు. ఇక హీరోలకు కూడా ఒక భాషలోనే కాదు.. అన్ని భాషల్లో అభిమానులు ఉంటారు. ఒకప్పుడు సినిమా అంటే ఒక భాషలోనే విడుదల చేసేవారు. ఇప్పుడు మార్కెట్ పెరిగింది. ఒక హీరో సినిమాను నాలుగైదు భాషల్లో విడుదల చేస్తున్నారు. దీంతో పాన్ ఇండియా సినిమాల సంఖ్య పెరిగిపోతోంది. హీరోలు కూడా అన్ని భాషల్లో అభిమానులను సంపాదించుకుంటూ పాన్ ఇండియా స్టార్లుగా ఎదుగుతున్నారు.

AJITH

అలా కోలీవుడ్‌లో స్టార్ హీరోలుగా ఉన్న రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ, విక్రమ్, విజయ్, అజిత్, విజయ్ సేతుపతి లాంటి స్టార్లకు తెలుగు ప్రేక్షకుల్లోనూ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. వీరి సినిమాలు నేరుగా తెలుగులోకి రిలీజ్ అవుతున్నాయి. అలా రిలీజ్ అయి ఇక్కడ హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక్కడి థియేటర్లలో కూడా వీరి సినిమాలు భారీ కలెక్షన్లను సాధిస్తాయి. దీంతో ఈ హీరోల సినిమాల తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకునేందుకు టాలీవుడ్ నిర్మాతలు పోటీ పడుతూ ఉంటారు.

ప్రస్తుతం వినోద్ డైరెక్షన్‌లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ‘వాలిమై’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించడంతో.. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. దీంతో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ రూ.10 కోట్లకు ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.