‘ఆచార్య’ సినిమా క‌థ‌పై వ‌స్తున్న కాపీ ఆరోప‌ణ‌ల‌న్నీ నిరాధార‌మైన‌వి..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ‘ఆచార్య’ సినిమా ఒరిజిన‌ల్ క‌థ‌, కాన్సెప్ట్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు మాత్ర‌మే చెందుతుంద‌ని తెలియ‌జేస్తున్నాం.. ఈ క‌థ‌పై వ‌స్తున్న కాపీ ఆరోప‌ణ‌ల‌న్నీ నిరాధార‌మైన‌వి.

ఆగ‌స్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఆచార్య సినిమా టైటిల్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ టైటిల్ పోస్ట‌ర్‌కు అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాకు వ‌చ్చిన హైప్ చూసి కొంద‌రు రైట‌ర్స్ ‘ఆచార్య‌’ సినిమా కథ తమదంటూ తప్పుడు ఆరోపణలు చేశారు.

సినిమా చిత్రీకరణ జరుగుతుండటం వల్ల సినిమా కథను రహస్యంగానే ఉంచాం. చాలా తక్కువ మందికి మాత్రమే కథ గురించిన అవగాహన ఉంది. కేవలం మోషన్ పోస్టర్‌ను చూసి ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం బాధాక‌రం. అంద‌రికీ చెప్పాల‌నుకున్న విష‌య‌మొక‌టే.. ‘ఆచార్య‌’ క‌థ ఒరిజిన‌ల్‌. కొర‌టాల శివ‌లాంటి పేరున్న ద‌ర్శ‌కుల‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌దు. కొన్ని ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లో ‘ఆచార్య‌’ సినిమా గురించి వ‌స్తోన్న రూమ‌ర్ స్టోరీల‌ను ఆధారంగా చేసుకుని ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఈ క‌థ‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌న్నీ నిరాధార‌మైన‌వి, త‌ప్పుడు క‌థ‌నాలు. ఎవ‌రికి వారు ఉహించుకున్నవి. ఈ క‌థ కోసం మెగా స్టార్ తో కొర‌టాల శివ రెండేళ్ల పాటు ట్రావెల్ అయ్యారు. ఆయ‌న ఇమేజ్‌కు త‌గినట్లు పర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘ఆచార్య‌’ సినిమా క‌థ‌ను సిద్ధం చేశారు.

శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తోన్న ఆచార్య సినిమా షూటింగ్ ద‌శ‌లోనే ఉంది. ఈ సినిమా విడుద‌ల కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. వీలైనంత త్వ‌ర‌గా సినిమాను పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తాం.