ప్రపంచవ్యాప్తంగా కమ్ముకున్న కరోనా సమస్య భారతదేశాన్ని కూడా పట్టిపీడిస్తోంది. కరోనా మరింత ప్రబలకుండా పాటిస్తున్న లాక్ డౌన్ సందర్భంగా వైద్య, పోలీసు మరియు ఇతర అధికారులు తమ శక్తిమేరకు సేవ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలందరూ కూడా ఇంటిపట్టునే ఉండాలని కోరారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, “ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ని తరిమి కొడదాం. ఆరోగ్యంగా జీవిద్దాం. స్టే హోమ్ స్టే సేఫ్. ఏప్రిల్ 14వ తేదీ వరకు ఇంట్లోనే ఉందాం, కరోనా ని కట్టడి చేద్దాం. కరోనా నియంత్రణకు అహర్నిశలూ శ్రమిస్తున్న పోలీసు యంత్రాంగానికి, మునిసిపల్ అధికారులకు, సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, రెవెన్యూ శాఖ వారికి, ఇతర అధికారులకు, వైద్య సిబ్బందికి, పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న నా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, ఎన్ జీ ఓ సంస్థలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.” అన్నారు