పాల్ డబ్బా నటుడిగా అరంగేట్రం

రఫ్ నోట్ ప్రొడక్షన్ తమ రాబోయే తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ప్రొడక్షన్ నం.5కి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ను తెలియజేసింది. యువ నటుడు రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రసిద్ధ దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రస్తుతం యువతలో సంచలనం సృష్టిస్తున్న మ్యూజిక్ సెన్సేషన్ పాల్ డబ్బా. ఈ ప్రాజెక్ట్‌తో ఆయన నటుడిగా అరంగ్రేటం చేస్తున్నారు. చెన్నై, తమిళనాడు నుంచి వచ్చిన అనీష్, తన మ్యూజిక్ పేరు పాల్ డబ్బాగా గుర్తింపు పొందాడు. రాపర్, సింగర్, సాంగ్ రైటర్ మరియు కొరియోగ్రాఫర్‌గా ఆయన బహుముఖ ప్రతిభ కలవాడు. 170CM, కాతు మేళ, అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయిన గలాట (ఆవేశం నుంచి) వంటి పాటలతో ఆయన ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రపంచంలో తనదైన స్థానం సంపాదించుకున్నాడు. ప్రత్యేకమైన శైలి, ఆయన ఎనర్జిటిక్‌ ప్రదర్శన, మరియు ఆయన నిజాయితీతో కూడిన లిరిక్స్‌తో ఆయనకు విశేషమైన అభిమానులు ఉన్నారు.

చిన్నప్పటి నుండి చల్లటి పాలను ఇష్టపడే అనీష్‌ తన పేరును “పాల్ డబ్బా” అనే ప్రత్యేకమైన పేరుగా మార్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఆయన నటన రంగంలో అడుగుపెడుతూ ఈ చిత్రం ద్వారా ఓ కొత్త మరియు ప్రభావవంతమైన పాత్రలో కనిపించనున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ: “పాల్ డబ్బా ఎనర్జీకి ఈ సినిమా స్పిరిట్‌కు బాగా సరిపోతుంది. ఆయన నిజజీవితంలోని అంకితభావం నిజాయితీతో మా సినిమాలోని పాత్రకు కరెక్ట్‌గా సరిపోతుంది” అన్నారు.

రాజ్ తరుణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ గోలీసోడా ఫ్రాంఛైజీ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్, విశేషమైన కథనంతో పాటు వైవిధ్యభరితమైన తారాగణంతో ముందుకు సాగుతోంది. ఈ చిత్రం విజయ్ మిల్టన్ దర్శకత్వంలో వచ్చిన గోలీసోడా ఫ్రాంచైజీల మాదిరిగానే ఎంతో బోల్డ్‌గా, భావోద్వేగపూరితంగా, యథార్థతకు దగ్గరగా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం.