ఉత్తరాది నుంచి మన చిత్రాలకు వస్తున్న ప్రేమను, డబ్బును గౌరవించాలి : విష్ణు మంచు

డైనమిక్ హీరో విష్ణు మంచు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. కన్నప్ప చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్‌లాల్ వంటి భారీ తారాగణం ఉంది. వివిధ ప్రాంతాలలోని నటుల మధ్య సహకార స్ఫూర్తి గురించి విష్ణు మాట్లాడుతూ.. ‘ప్రజలు ఇకపై కళాకారులను ‘దక్షిణ నటుడు’ లేదా ‘ఉత్తర నటుడు’గా చూడరు. ప్రేక్షకులు వారిని తమ సొంత ఇంటి మనుషుల్లా ఆదరించడం ప్రారంభించారు’ అని అన్నారు.

ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్‌గా అన్ని భాషల చిత్రాలను ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. దీనిపై విష్ణు మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మన చిత్రాలకు ఉత్తరాది నుంచి ఎక్కువ ప్రేమ, డబ్బు వస్తోంది. దాన్ని మనం గౌరవించాలి. వారు మన సినిమాలపై ప్రేమను కురిపిస్తున్నారు. మనం దానిని అంగీకరించాలి’ అని అన్నారు.

ప్రస్తుతం దక్షిణ బారత సినిమా పరిశ్రమ దూసుకపోతోంది. భావోద్వేగపరంగా ప్రతిధ్వనించే, మట్టి కథల్ని చెప్పడం వల్లే సినిమాలు విజయాన్ని సాధిస్తున్నాయని అన్నారు. అందుకే తాను కన్నప్ప కథను తెరకెక్కించానని అన్నారు. మన మట్టిలో పుట్టిన ఈ కథను ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూసేలా చేస్తున్నామని అన్నారు. సౌత్‌లోని నాలుగు పరిశ్రమలను.. బాలీవుడ్‌తో పోల్చడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఇక త్వరలోనే ఓ బాలీవుడ్ యాక్టర్‌తో 1940వ దశకంలోని ఓ కథతో సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని విష్ణు తెలిపారు.