‘పతంగ్‌’ నుంచి లిరికల్ వీడియో సాంగ్‌ విడుదల

ఇప్పటి వరకు ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్ష‌కులు చూసి వుంటారు. కాని అందరిలో ఎంతో మమేకమైన ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. మ‌రికొంత మంది నూత‌న న‌టీన‌టుల‌తో పాటు ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రెండీ సాంగ్‌ హవ హవ అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌. సంగీత దర్శకుడు జోస్‌ జిమ్మీ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు ఆయనే సాహిత్యం సమకూర్చి ఆలపించాడు. సినిమాలో ఈ సాంగ్‌ ఎంతో యూత్‌ఫుల్‌గా నేటి ట్రెండీగా ఉంటుంది. ఇక చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన పాటలకు చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా థియేటర్‌లో యూత్‌ఫెస్టివల్‌లా వుంటుంది. కొత్త‌వాళ్ల‌తో చేసిన మా సినిమా కొత్త‌గా వుండ‌టంతో పాటు చాలా పెద్ద సినిమా క్వాలిటీతో వుంటుంది అన్నారు. ఈ సినిమాకు క‌థే హీరో. ఈ చిత్రానికి జోస్ జిమ్మి అద్భుత‌మైన పాట‌లు ఇచ్చాడు. ఇప్పటి వరకు విడుదల చేసిన అన్ని పాటలకు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం. త‌ప్ప‌కుండా మా ప‌తంగ్ చిత్రం అన్నివ‌ర్గాల వారిని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది. కొత్త కంటెంట్‌ను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం వుంది’ అన్నారు.