స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఈ సినిమా నుంచి సెకండ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో…
రాఘవ లారెన్స్ మాట్లాడుతూ ‘‘వాసుగారు ‘చంద్రముఖి2’ మూవీ చేస్తున్నామని అనౌన్స్ చేయగానే రజినీకాంత్‌గారితో చేస్తున్నారేమోనని అనుకున్నా. ఆయనతో ఫోన్ చేసి మాట్లాడితే రజినీగారు బిజీ షెడ్యూల్ వల్ల చేయటం లేదు మరో హీరోతో చేయాలనుకుంటున్నానని అన్నారు. సరే కథ ఎప్పుడు చెబుతారని అనగానే సాయంత్రం కలవమని అన్నారు. నేను వెళ్లగానే ఆయన కథ చెప్పారు. నాకెంతో నచ్చింది. రజినీకాంత్‌గారు చేసిన రోల్‌లో నేను నటించటం అంటే ఆ రాఘవేంద్రస్వామిగారి అదృష్టం అని అనుకోవాలి. సూపర్‌స్టార్‌గారు చేసిన ఆ పాత్రను నేనెంత గొప్పగా చేయగలనా? అని ఆలోచించలేదు. నా పాత్రకు నేను న్యాయం చేస్తే చాలని అనుకుని చాలా భయపడుతూ నటించాను. కచ్చితంగా సినిమా మీ అందరినీ మెప్పిస్తుందని అనుకుంటున్నాను. కంగనా రనౌత్ వంటి పెద్ద స్టార్‌తో నటించటం లక్కీ. ముందు ఆమె సెట్స్‌లోకి అడుగు పెట్టగానే ఆమెకున్న సెక్యూరిటీని చూసి భయపడ్డాను. ఆ విషయం ఆమెకు చెప్పగానే ఆమె సెక్యూరిటీని బయటకు పంపేశారు. చక్కగా కలిసిపోయి నటించారు. చంద్రముఖి పాత్రలో భయపెట్టారు. వాసుగారితో ఇది వరకు శివలింగ అనే సినిమా చేశాను. ఆ సినిమాకు పూర్తి భిన్నంగా ‘చంద్రముఖి2’ చేశాం. ఈ సినిమా చేస్తున్నా అని అనుకున్న తర్వాత సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. నా గురువుగారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. అలాగే ఈ సినిమాలో వేట్టయార్ రోల్ చేసినప్పుడు కూడా రజినీగారి ఆశీర్వాదాలు తీసుకునే నటించాను. ఆస్కార్ విన్నర్ కీరవాణిగారు, వడివేలు వంటి స్టార్ కమెడియన్‌తో మళ్లీ పనిచేయటం మరచిపోలేని ఎక్స్‌పీరియెన్స్. సెప్టెంబర్ 28న మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మాట్లాడుతూ ‘‘నేను ఇంతకు ముందు దక్షిణాదిలో సినిమాలు చేశాను. తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో నటించాను. ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను ‘చంద్రముఖి2’తో పలకరిస్తాను. ఈ మూవీలో చంద్రముఖి పాత్ర తెలుగులో మాట్లాడుతుంది. వాసుగారు ఓ వారియర్ సినిమా చేయాలని నా దగ్రకు వచ్చినప్పుడు నేను చంద్రముఖి 2లో చంద్రముఖిగా ఎవరు నటిస్తున్నారని అడిగాను. ఎవరినీ తీసుకోలేదని అన్నారు. నేను నటిస్తానని అడగ్గానే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టాను. ‘చంద్రముఖి’లో కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ఎలాగైతే మిక్స్ అయ్యుంటాయో ‘చంద్రముఖి2’లోనూ అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. చంద్రముఖిని పలు భాషల్లో చేశారు. అయితే జ్యోతికగారు ఆ పాత్రను చాలా ఎఫెక్టివ్‌గా చేశారు. ఆమె నుంచి స్ఫూర్తి పొందాను. చంద్రముఖిలో జ్యోతికను చంద్రముఖి ఆవహిస్తుంది. కానీ ‘చంద్రముఖి2’లో నిజమైన చంద్రముఖి పాత్ర ఉంటుంది. దాని కోసం డైరెక్టర్ వాసుగారు కొత్తగా నా పాత్రను తీర్చిదిద్దారు. సెప్టెంబర్ 28న ‘చంద్రముఖి2’ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.
డైరెక్టర్ పి.వాసు మాట్లాడుతూ ‘‘చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘చంద్రముఖి2’తో రాబోతున్నాను. చంద్రముఖి సినిమాతో ‘చంద్రముఖి2’ను లింక్ చేసి ఈ కథను సిద్ధం చేశాను. కచ్చితంగా ఆడియెన్స్‌కు సినిమాను మెప్పిస్తుంది. తెలుగులో నాగవల్లి సినిమా ఉంది. అందులో డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. కానీ ఇందులో 17 ఏళ్ల ముందు కోట నుంచి వెళ్లి పోయిన చంద్రముఖి మళ్లీ ఎందుకు వచ్చిందనే పాయింట్‌తో చేశాను. సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారి పాత్రలో రాఘవ లారెన్స్ నటించారు. ఆస్కార్ విన్నర్ కీరవాణిగారితో వర్క్ చేయటం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. ఇళయరాజాగారి తర్వాత అంత మ్యూజిక్ సెన్స్ ఉన్న సినిమా. అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారాయన. తప్పకుండా సెప్టెంబర్ 28న వస్తున్న ‘చంద్రముఖి2’ ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు.
మహిమా నంబియార్ మాట్లాడుతూ ‘‘చంద్రముఖి2’ నాకెంతో స్పెషల్ మూవీ. కంగనా రనౌత్‌గారు, రాఘవ లారెన్స్‌గారు, వడివేలుగారు ఇలా పెద్ద స్టార్ క్యాస్ట్, భారీ బడ్జెట్‌తో చేసిన సినిమాలో నటించటం మంచి ఎక్స్‌పీరియెన్స్. వాసుగారు వంటి సీనియర్ డైరెక్టర్‌తో వర్క్ చేయటం మెమరబుల్. సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతున్న ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.