- పోస్టర్లతోనే అంచనాలు పెంచేస్తున్న ‘బ్రో’
- ఫస్ట్ లుక్ పోస్టర్లను మించేలా ‘బ్రో ద్వయం’ పోస్టర్
మేనమామ-మేనల్లుడు ద్వయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ద్వయం కలిసున్న పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.
‘బ్రో ద్వయం’ పేరుతో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసున్న పోస్టర్ ను మే 29న ఉదయం 10:08 గంటలకు విడుదల చేశారు. బైక్ మీద ఒక కాలు పెట్టి పవన్ కళ్యాణ్ నిల్చొని ఉండగా, ఆయన మోకాలిపై చేతులు ఉంచి సాయి ధరమ్ తేజ్ నిల్చొని ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ చేతులపై పవన్ కళ్యాణ్ చేయి ఉండటం చూస్తుంటే నేనున్నాను అని భరోసా ఇస్తున్నట్లుగా ఉంది. పవన్ కళ్యాణ్ కంటిచూపుతోనే దేన్నైనా శాసించగలరనే అంతలా శక్తివంతంగా కనిపిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ ముఖంలో మాత్రం సున్నితత్వం ఉట్టిపడుతోంది. మొత్తానికి మామ-అల్లుడు ద్వయం పోస్టర్, సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది.
మే 18న ‘బ్రో’ టైటిల్ ని ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన లభించింది. “కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం.. కాలః వర్జయేత్ చారణం.. కాలః జన్మనాజాయతే జయం స్వయం శ్రియం ద్వయం.. బ్రో బ్రోదిన జన్మలేషం.. బ్రో బ్రోవగ ధర్మశేషం.. బ్రో బ్రోచిన కర్మహాసం.. బ్రో బ్రోదర చిద్విలాసం” అనే శ్లోకంతో పవన్ కళ్యాణ్ పాత్రను పరిచయం చేసిన తీరు కట్టిపడేసింది. ఇక మే 23న, ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ పోషిస్తున్న మార్క్ అలియాస్ మార్కండేయులు పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కి కూడా విశేష స్పందన లభించింది. “బ్రోదిన జన్మలేషం.. బ్రోవగ ధర్మశేషం.. బ్రోచిన కర్మహాసం.. బ్రోదర చిద్విలాసం” అనే శ్లోకంతో శాంతికి చిహ్నంలా తెల్ల దుస్తుల్లో ఆయన పాత్రను పరిచయం చేయడం అమితంగా ఆకట్టుకుంది. తాజాగా విడుదల చేసిన ‘బ్రో ద్వయం’ పోస్టర్ ఆ రెండు పోస్టర్లను మించేలా ఉంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్ బస్టర్ నిర్మాణ సంస్థగా దూసుకుపోతోంది. ‘కార్తికేయ-2’, ‘ధమాకా’ వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఈ సంస్థ.. ప్రస్తుతం పలు చిత్రాలను నిర్మిస్తోంది. అందులో ‘బ్రో’ వంటి భారీ చిత్రాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో మొదటిసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతులు కలపడం, పైగా ఇందులో పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తుండటంతో ప్రకటనతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్మాణ సంస్థ ఎక్కడా వెనకాడకుండా భారీస్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమా చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడమే కాకుండా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్థాయిని మరింత పెంచే చిత్రమవుతుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.
‘బ్రో’ సినిమా 2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి కానుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలన్నీ త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే అద్భుతమైన చిత్రాన్ని అందించాలని చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా ఏ.ఎస్. ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
తారాగణం: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ , సముద్ర ఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా,తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృథ్విరాజ్, నర్రాశ్రీను, యువలక్ష్మి , దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్
రచన, దర్శకత్వం: పి. సముద్రఖని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
డీఓపీ: సుజిత్ వాసుదేవ్
సంగీతం: ఎస్.ఎస్. థమన్
ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
ఫైట్స్: సెల్వ
వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్: నిఖిల్ కోడూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం
కో-డైరెక్టర్: బి. చిన్ని
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్