సినిమా రివ్యూ : వేద
నటీనటులు : శివ రాజ్ కుమార్, గానవి లక్ష్మణ్, భరత్ సాగర్, శ్వేతా చంగప్ప, ఉమాశ్రీ, అదితి సాగర్, వీణా పొన్నప్ప తదితరులు
ఛాయాగ్రహణం : స్వామి జె. గౌడ
సంగీతం : అర్జున్ జన్యా
నిర్మాత : గీతా శివ రాజ్ కుమార్, జీ స్టూడియోస్
విడుదల (తెలుగులో) : ఎంవిఆర్ కృష్ణ
రచన, దర్శకత్వం : హర్ష
విడుదల తేదీ: ఫిబ్రవరి 9, 2023
కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన 125వ సినిమా ‘వేద’. తెలుగులో ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత ఎంవిఆర్ కృష్ణ విడుదల చేస్తున్నారు.
వేద (శివ రాజ కుమార్) కుమార్తె కనక (అదితి సాగర్) జైలు నుంచి విడుదల అవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చంద్రగిరిలో పోలీస్ అధికారి రుద్ర (భరత్ సాగర్)ను అత్యంత కిరాతకంగా చంపేస్తారు. మర్డర్ వేద, కనక చేశారని మరో మహిళా పోలీస్ అధికారి రమా (వీణా పొన్నప్ప)కి తెలుసు. రుద్రను హత్య చేశాక… మరో నలుగురిని చంపేస్తారు. అత్యంత కిరాతకంగా తండ్రీ కూతుళ్ళు మారణకాండ ఎందుకు సాగించారు? వేద గతం ఏమిటి? కనక ఎందుకు జైలుకు వెళ్ళి వచ్చింది? వేద భార్య పుష్ప (గానవి లక్ష్మణ్) ఏమైంది? వేద, అతని కుమార్తెకు సహాయం చేస్తున్న వ్యక్తిని చంపాలని ప్రయత్నిస్తున్న వేశ్య (శ్వేతా చంగప్ప) ఎవరు? చివరకు వేద, కనక తెలుసుకున్న నిజం ఏమిటి? ఎందుకు మహిళా పోలీస్ అధికారి వీళ్ళను అడ్డుకోకుండా చంపే స్వేచ్ఛ ఇచ్చింది? అనేది సినిమాలో చూడాలి.
యాక్షన్ వెనుక ఎమోషన్ ఎంత బలంగా ఉంటే… ఫైట్ చేసేటప్పుడు థియేటర్లలో ప్రేక్షకులకు అంత హై వస్తుంది. యాక్షన్ సీన్ ఎలివేట్ అవుతుంది. హీరో ఫైట్ చేసినా… హీరోయిన్ ఫైట్ చేసినా… అందులో మార్పు ఉండదు. ఆ విషయాన్ని ‘వేద’ మరోసారి బలంగా చెబుతుంది.
‘వేద’ కథా నేపథ్యం అంతా 1985, 1965లలో ఉంటుంది. అయితే… ఈ కాలంలోనూ మహిళలు ఎదుర్కొంటున్న ఓ సమస్యను బలంగా చెప్పారు. అమ్మాయిలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టినప్పుడు ధైర్యంగా ఉండాలని, భయపడకూడదని సందేశం ఇస్తుంది. ‘వేద’ ప్రారంభం బావుంది. ఎందుకు చంపుతున్నారు? అని చిన్న ఆసక్తి కూడా ఉంటుంది. అయితే… మధ్య మధ్యలో వచ్చే హీరో హీరోయిన్ ట్రాక్ కొంచెం బోర్ కొట్టిస్తుంది. అందులో కన్నడ ఫ్లేవర్ ఎక్కువ అయ్యింది. దానికి తోడు ఆ కామెడీ కూడా మనకు కనెక్ట్ కాదు. ఇంటర్వెల్ ముందు ఫైట్, క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మధ్యలో గానవి లక్ష్మణ్ చేసే ఫైట్ కూడా!
‘వేద’ ప్రచార చిత్రాలు చూసినా… సినిమా చూసినా… ‘కెజియఫ్’ ప్రభావం బలంగా కనబడుతుంది. సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, లైటింగ్ విషయంలో ‘కెజియఫ్’ ప్యాటర్న్ ఫాలో అయ్యారు. సంగీతంలోనూ ‘కెజియఫ్’ ఛాయలు ఉన్నాయి. సేమ్ మ్యూజిక్ కొట్టలేదు. కానీ, ఎలివేషన్స్ ఇచ్చే విషయంలో ఏమాత్రం తగ్గలేదు. అర్జున్ జన్యా రీ రికార్డింగ్ వల్ల కొన్ని సీన్స్ ఎలివేట్ అయ్యాయి. నేపథ్య సంగీతంలో ఉపయోగించిన పాటలు కూడా బావున్నాయి. నిర్మాణ విలువలు బావున్నాయి.
నటుడిగా, కథానాయకుడిగా 125 సినిమాల శివ రాజ్ కుమార్ అనుభవం ‘వేద’ పాత్రలో కనిపించింది. ఇటువంటి యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ రోల్స్ ఆయన ఇంతకు ముందు చేశారు. మరోసారి పాత్రకు ప్రాణం పోశారు. ‘వేద’కు సినిమాకు వస్తే ఆయనలో గొప్పదనం ఏమిటంటే… ఫైట్స్ అన్నీ తాను ఒక్కడినే చేయాలని అనుకోలేదు. హీరోయిజంతో పాటు షీరోయిజం ఎలివేట్ అయ్యే అవకాశం ఇచ్చారు. గానవి లక్ష్మణ్, అదితి సాగర్… ఇద్దరూ ఫైట్స్ చేశారు. వాళ్ళు చేసిన ఫైట్స్ ‘హై’ ఇస్తాయి. ఫైట్స్ చేసేటప్పుడు వాళ్ళ నటన కూడా బావుంది. మిగతా క్యారెక్టర్లలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు తక్కువ. ఆల్మోస్ట్ అంతా కన్నడ యాక్టర్లు ఉన్నారు.
‘వేద’ ఎమోషనల్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్… రెండూ ఉన్నాయి. మెసేజ్ కూడా ఉంది. ‘కెజియఫ్’లో మదర్ ఎమోషన్ అయితే… ‘వేద’లో వైఫ్ & డాటర్ ఎమోషన్. ఇందులో హీరోయిజం మాత్రమే కాదు… షీరోయిజం ఉంది. శివన్నతో పాటు గానవి లక్ష్మణ్, అదితి సాగర్ చేసే ఫైట్స్ ఆకట్టుకుంటాయి. కన్నడ ఫ్లేవర్, ఫ్యామిలీ సీన్స్ పక్కన పెడితే సినిమా ఎంటర్టైన్ చేస్తుంది.