ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్ టైన్‌మెంట్ బేనర్ లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫస్ట్ డే ఫస్ట్ షో`. ‘జాతిరత్నాలు’తో బ్లాక్ బస్టర్ ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో కథానాయకుడు శ్రీకాంత్ రెడ్డి విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
మీ నేపధ్యం గురించి చెప్పండి,..అలాగే ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
మాది హైదరాబాద్. అల్వాల్ లో వుంటాను. బిటెక్ పూర్తి చేశాను. బిటెక్ థర్డ్ ఇయర్ నుండే సినిమాల పై ఆసక్తి పెరిగింది. కొన్ని లఘు చిత్రాలు చేశాను. కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. ఈ క్రమంలో పిట్టగోడ ఆడిషన్ లో మెయిన్ లీడ్ గా ఎంపికయ్యాను. అక్కడే అనుదీప్ పరిచయం. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో కూడా మంచి పాత్రల కోసం ఆడిషన్స్ ఇస్తూనే వున్నాను. కథ హీరో అని నమ్ముతాను. మంచి కథలో చిన్న పాత్ర చేసినా తృప్తి వుంటుంది. అలాంటిది చిరంజీవి గారు , కమల్ హసన్ గారు లాంటి గొప్పగొప్ప హీరోలతో గొప్ప క్లాసిక్ చిత్రాలు తీసిన పూర్ణోదయ బ్యానర్ లో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. వంశీ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. అంతకుముందే అనుదీప్ ఈ కథ గురించి ఒకసారి నాకు చెప్పారు. చాలా అద్భుతమైన కథ. ఆడిషన్స్ ఇచ్చాను. దర్శక నిర్మాతలకు నచ్చింది. తర్వాత ఫోటోషూట్ చేశారు. అందులో సెలెక్ట్ అయిన తర్వాతే ఫైనల్ చేశారు. నాకు ఎలాంటి సినిమా నేపధ్యం లేదు. నాలో ప్రతిభని గుర్తించి అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది.
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కథ నేపధ్యం గురించి చెప్పండి ?
ఈ కథ చాలా రిఫ్రెషింగ్ గా వుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ సాధించడానికి శీను అనే కుర్రాడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది కథాంశం. కథలో అద్భుతమైన సోల్ తీసుకొచ్చారు అనుదీప్. జాతిరత్నాల్లో ప్రతి సీన్ హ్యూమర్స్ గా వుంటుంది. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కూడా ప్రతి సీన్ హిలేరియస్ గా వుంటుంది. నారయణఖేడ్, శంకర్ పల్లి, చేవెళ్ళ ప్రాంతాల్లో ఖుషి సినిమానాటి వాతావరణం రిక్రియేట్ చేసేలా వింటేజ్ లుక్ లో షూట్ చేశాం. అనుదీప్ నారయణఖేడ్ ప్రాంతంలో పెరిగారు. ఆయన రాసే కథలు ఆ ప్రాంతం చుట్టూ జరిగేవే, అక్కడ ఆయన చూసిన వాతావరణంకు తగ్గట్టు లోకేషన్స్ ని ఎంచుకున్నాం.
హాస్య ప్రధానమైన పాత్ర చేయడం ఎలా అనిపించింది ?
కథలో నాకు నచ్చిన అంశం హాస్యం. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్. నా పాత్ర చాలా హిలేరియస్ గా వుంటుంది. ఇందులో నా పాత్ర చేయడానికి వంశీ, అనుదీప్, శ్రీజ గారు చాలా ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. దాదాపు 20 రోజులు వర్క్ షాప్ చేశాం. ఈ పాత్రని చాలా ఎంజాయ్ చేశా.
ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపించారు.. రియల్ లైఫ్ లో ఎవరి ఫ్యాన్ ?
పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే సూర్య గారు అంటే కూడా ఇష్టం.
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చూసిన జ్ఞాపకాలు ఏమైనా ఉన్నయా ?
పోకిరి, అత్తారింటికి దారేది, సూర్య గారి సినిమాలు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చుసిన అనుభవాలు వున్నాయి. టికెట్లు దొరక్కపొతే గోడలు దూకి పోలీసులతో దెబ్బలు తిన్న సందర్భాలు కూడా వున్నాయి. ఐతే నా కంటే నా ఫ్రండ్స్ ఎక్కువ దెబ్బలు తిన్నారు. (నవ్వుతూ)
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కి ఇద్దరు దర్శకులు కదా.,,. ఇద్దరి దర్శకులతో పని చేయడం ఎలా అనిపించింది ?
ఈ కథ సోల్ ని అనుదీప్ ఎంతలా అర్ధం చేసుకున్నారో వంశీ కూడా అంతే సమానంగా అర్ధం చేసుకున్నారు. అనుదీప్ శివకార్తికేయన్ గారి సినిమాతో బిజీ గా వుండటం వలన టెక్నికల్ గా స్ట్రాంగ్ గా వుండే లక్ష్మీనారాయణను మరో దర్శకుడిగా ఎంపిక చేశారు. వంశీ, లక్ష్మీ ఇద్దరూ గొప్ప సమన్వయంతో పని చేశారు. ఎవరి చేతిలో మైక్ వుంటే వాళ్ళే యాక్షన్ కట్ చెప్పేవారు. లక్ష్మీ నాకు టెక్నికల్ గా సపోర్ట్ చేస్తే.. వంశీ యాక్టింగ్ పరంగా హెల్ప్ చేశారు.
తనికెళ్ళ భరణి గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
అంత పెద్ద నటుడి తో కలసి పని చేయడం నా అదృష్టం. ఆయన్ని కలసిన మొదటి రోజే చాలా పాజిటివ్ వైబ్ ఇచ్చారు. ఇందులో ఆయనికి కొడుకుగా కనిపిస్తా. మొదటిరోజు కలిసినప్పుడు ”హాయ్ డాడీ’ అని పిలిచా. ”చాలా యాక్టివ్ గా వున్నాడు .. పన్జేస్తాడు”అని నవ్వేశారు. ఒక తండ్రిలా చాలా మెళకువలు నేర్పారు. ఆయన అనుభవంతో కొంత యాడ్ చేశారు.
హీరోయిన్ గురించి చెప్పండి ?
ఈ సినిమాలో నవ్వుతూనే వుంటాం. కానీ హీరో హీరోయిన్ సీన్స్ వచ్చినపుడు మాత్రం కాస్త ఆగుతాం. చాలా మంచి లవ్ ట్రాక్. ఒక పది నిమిషాల తర్వాత హీరో హీరోయిన్ ని మన పక్కింటి వాళ్ళలానే ట్రీట్ చేస్తారు ప్రేక్షకులు. హీరోయిన్ పాత్రలో అమాయకత్వం వుంటుంది. అలాంటి అమ్మాయి టికెట్స్ అడిగితే నేనూ ట్రై చేస్తానని ప్రేక్షకులు ఫీలౌతారు.
వెన్నెల కిషోర్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
వెన్నెల కిషోర్ గారిది ఇందులో చిన్న పాత్రే అయినా కీలకమైన పాత్ర. మొదట్లో చేస్తారో లేదో అనే అనుమానం వుండేది. ఐతే స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆయన చేయడానికి అంగీకరించారు. ఆయన సెట్ కి వచ్చిన ప్రతి రోజు నవ్వుతూనే వున్నాం. పవన్ కళ్యాణ్ గురించి ఒక సీన్ వుంటుంది. ఆ సీన్ ని తన అనుభవాన్ని యాడ్ చేసే అద్భుతంగా చేశారు. అది మీరు థియేటర్లోనే చూడాలి.
ప్రమోషన్స్ హిలేరియస్ గా చేస్తున్నారు కదా ?
అవును.. అనుదీప్ నాకు తొమ్మిదేళ్ళుగా తెలుసు. ఆయన మాట్లాడుతూనే ఎవరూ హార్ట్ కాకుండా పంచ్ వేయగలడు. అయితే ఆ పంచ్ కి ఆయన ఏ మాత్రం నవ్వకపోవడం మరో ప్రత్యేకత. ప్రమోషన్స్ ని హిలేరియస్ గా డిజైన్ చేసే ఆలోచన అనుదీప్ దే. ఏం చేసిన హ్యూమరస్ గా వుండాలని భావిస్తాడు.
ఇండస్ట్రీలో అనుదీప్ మీ గాడ్ ఫాదర్ అనుకోవచ్చా ?
గాడ్ ఫాదర్ అనడం కంటే మంచి స్నేహితుడు, బ్రదర్ అని భావిస్తా. సినిమానే కాకుండా వ్యక్తిగతంగా అనుదీప్ అంటే చాలా ఇష్టం. సినిమా లేకపోయినా కూడా ఏ పరిస్థితిలోనూ ఆయన్ని వదులుకోను. ఆయన కథలు నాతో పంచుకుంటారు. మీరు గమనిస్తే జాతిరత్నాలు సినిమాలో హీరో పేరు శ్రీకాంత్. పిట్టగోడ సినిమా జరుగుతున్నప్పుడే ఆ కథ చెప్పారు. సూపర్ హిట్ అని అప్పుడే చెప్పా.
‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మ్యూజిక్ గురించి ?
రధన్ గారు నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలతో పాటు నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా చేశారు.
మీరు ఎలాంటి కథలు చేయాలని అనుకుంటున్నారు ?
నాకు అన్ని కథలు చేయాలనీ వుంటుంది. ఐతే కామెడీ, లవ్ స్టోరీస్ ఇష్టం.
నిర్మాతలు నుండి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ?
సినిమా చూసిన తర్వాత శ్రీజ, శ్రీరామ్ గారు అద్భుతంగా చేశావని చెప్పారు. పూర్ణోదయ బ్యానర్ లో నేనూ ఒక భాగం అవ్వడం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.
సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్ది ఒత్తిడి వుంటుందా ?
కొంచెం టెన్షన్ అయితే వుంది. అయితే మేము అనుకున్న కంటెంట్ ప్రేక్షకులకు సరిగ్గా రీచ్ అవుతుందనే నమ్మకం వుంది. ప్రేక్షకులు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
ఆల్ ది బెస్ట్
థాంక్స్