ఏపీలో ప్రస్తుతం రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. ప్రభుత్వం, ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన కొడాలి నాని.. నిమ్మగడ్డపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు, నిమ్మగడ్డ కలిసి పంచాయతీ ఎన్నికల్లో కుట్రలు చేస్తున్నారంటూ కోడాలి నాని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కోడాలి నానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ షోకాజ్ నోటీసులు పంపారు. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరారు. దీనిపై కొడాలి నాని ఇచ్చిన వివరణపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు.
ఈ క్రమంలో మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు ఐపీసీ 504, 505(1)(C), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశాల్లో ఎస్ఈసీ పేర్కొంది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి.