“అన్నపూర్ణమ్మ గారి మనవడు” చిత్రానికి మంచి ఓపెనింగ్స్ తో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని చిత్ర దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) వెల్లడించారు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నాయనమ్మగా, మాస్టర్ రవితేజ మనవడిగా టైటిల్ పాత్రలు పోషించిన చిత్రమిది. హీరో హీరోయిన్లుగా బాలాదిత్య, అర్చన నటించగా, ఓ కీలక పాత్రలో సీనియర్ నటి జమున నటించారు. ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై ఎం.ఎన్.ఆర్.చౌదరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో విడదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఈ చిత్రాన్ని మీడియాకు ప్రదర్శించడంతో పాటు సక్సెస్ మీట్ ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, చిత్ర దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు), హీరో, హీరోయిన్లు బాలాదిత్య, అర్చన, నటుడు తాగుబోతు రమేష్, అమెజాన్ ప్రతినిధి రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా చిత్ర దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) మాట్లాడుతూ, “రెండు తెలుగు రాష్ట్రాలలోని నైజాం, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ వంటి అన్ని చోట్ల ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ రావడం ఆనందంగా ఉంది. కుటుంబ విలువలను చాటి చెప్పే చక్కటి కథతో ఈ చిత్రాన్ని మలచడంతో పాటు పరువు హత్యల అంశాన్ని ఇందులో చర్చించాం. మహానటి జమున 30 ఏళ్ల తర్వాత మా చిత్రంలో నటించడం ఓ విశేషం. పల్లెటూరి పచ్చదనాల నేపథ్యంలో తీసిన ఈ చిత్రంలో ఎందరో సీనియర్ నటీ నటులు నటించడమే కాదు తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఇప్పటికే ఓవర్ సీస్ అమెజాన్ లో విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలో కూడా ఇక్కడి ప్రేక్షక ఆదరణ పొందుతుండటం మా చిత్ర బృందానికి ఎనలేని సంతోషాన్ని అందిస్తోంది” అని అన్నారు.
అతిథిగా పాల్గొన్న టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, “ఉమ్మడి కుటుంబాల అనుబంధాలు, ఆప్యాయతలను ఆవిష్కరించిన చిత్రాలొచ్చి చాలా కాలమైపోయింది. మళ్లీ అలాంటి కథతో ఈ చిత్రం రావడం, ప్రేక్షక ఆదరణ పొందుతుండటం ఆనందదాయకం. కోవిడ్ వల్ల థియేటర్లు తెరచుకోవడం ఆలస్యమైనా నిర్మాత ఎం.ఎన్.ఆర్.చౌదరి అభిరుచే ఈ చిత్రాన్ని ముందుకు నడిపించింది” అని అన్నారు.
హీరో బాలాదిత్య మాట్లాడుతూ, ఇందులో లెంగ్త్ తక్కువైనా చాలా మంచి పాత్ర చేశాను. అయినప్పటికీ నాకు, అర్చనకు మధ్య ఎక్కువ సన్నివేశాలున్నాయి. ఇలాంటి మంచి చిత్రాలు రావలసిన అవసరం ఎంతైనా ఉంది” అని అన్నారు.
హీరోయిన్ అర్చన మాట్లాడుతూ, ఎన్నో సినిమాలు, ఎన్నో పాత్రలు చేస్తుంటాం. అయితే కొన్నే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి చిత్రాలలో ఈ చిత్రం ఒకటి. నటనకు ఎంతో అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషించాను” అని చెప్పారు.
నటుడు తాగుబోతు రమేష్ మాట్లాడుతూ, అందరూ చూడదగిన ఆహ్లాదభరితమైన చిత్రమిది, ఇందులో నేను కూడా భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది” అని అన్నారు. అమెజాన్ ప్రతినిధి రాజీవ్ మాట్లాడుతూ, లోగడ ఈ చిత్రాన్ని ఇండియాలో కాకుండా ఓవర్ సీస్ అమెజాన్లో విడుదల చేశామని, అక్కడ మంచి ఆదరణ లభించిందని చెప్పారు.