డ్రగ్స్ కేసు: నోటీసులపై స్పందించిన కరణ్

బాలీవుడ్‌లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో నిన్న రాత్రి ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. 2019లో నిర్వహించిన పార్టీకి సంబంధించిన వివరాలను సమర్పించాలని ఆ నోటీసుల్లో NCB పేర్కొంది. ఈ క్రమంలో తనకు వచ్చిన నోటీసులపై కరణ్ జోహార్ స్పందించాడు. 2019లో తన ఇంట్లో నిర్వహించిన పార్టీలో ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశాడు.

KARAN JOHAR

అలాగే 2019లో తన హౌస్‌లో నిర్వహించిన పార్టీకి సంబంధించిన వివరాలతో పాటు ఒక పెన్‌డ్రైవ్‌ను ఎన్సీబీకి కరణ్ జోహార్ పంపాడు. దీంతో ఇప్పుడు కరణ్ పంపించిన డీటైల్స్‌ను ఎన్సీబీ అధికారులు క్రాస్ చెక్ చేయనున్నారు. జులై 2019లో కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఒక వీడియో బయటికొచ్చింది. ఈ వీడియోలో సెలబ్రెటీలు డ్రగ్స్ తీసుకున్నట్లు కనిపించింది.

ఈ వీడియోలో అప్పట్లో బాగా వైరల్ అయింది. దీనిపై గతంలో ఒక కేసు నమోదు అవ్వగా.. అప్పట్లో కూడా తాను డ్రగ్స్ తీసుకోలేదని కరణ్ చెప్పాడు. ఇటీవల సుశాంత్ సింగ్ మరణం తర్వాత డ్రగ్స్ కేసు తెరపైకి రాగా.. దాంతో ఈ వీడియోకి సంబంధించి కేసు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పలువురి సెలబ్రెటీలను అరెస్ట్ చేసిన క్రమంలో కరణ్‌కు నోటీసులు పంపండం సంచలనంగా మారింది.