జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. యువ కార్యకర్తల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని, జీహెచ్ఎంసీ పరిధిలోని కార్యకర్తల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, వారి కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు పవన్ తెలిపారు. కార్యకర్తల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీలోకి దింపుతామన్నారు.
ఇవాళ జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 1న ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నవంబర్17 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. నవంబర్ 20తో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. నవంబర్ 21న నామినేషన్లను పరిశీలించన్నారు. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరపనుండగా.. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి.
ఒకవైపు వరుస సినిమా షూటింగ్లతో బిజీబిజీగా ఉన్న పవన్.. మరోవైపు రాజకీయాలపై కూడా దృష్టి పెట్టారు. ఇటీవలే తెలంగాణ జనసేన పార్టీ జిల్లా కమిటీలను నియమించారు. ఇక ఏపీ రాజకీయాలపై కూడా ఫోకస్ పెట్టి వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు.