
హైదరాబాద్: సినిమాలు విడుదలై థియేటర్ల నుంచి వెళ్లిపోయినా కొన్ని చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి ప్రత్యేక గుర్తింపు పొందిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి ఎనిమిదేళ్లుగా ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానాన్ని వేడుకగా నిర్వహించారు. ‘ఈఎన్‌ఈ రిపీట్’ సినిమా విడుదలకు ముందు ఈఎన్‌ఈ చిత్రబృందం ఆధ్వర్యంలో ‘ఈఎన్‌ఈ డే’ పేరుతో రోజంతా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో పాటు చిత్రబృందం అభిమానులతో కలిసి సందడి చేసింది.
సాధారణ సినిమా ప్రచార కార్యక్రమాలకు భిన్నంగా ఈ వేడుకలో ‘ఈఎన్‌ఈ గాట్ లేటెంట్’, ప్యానల్ చర్చలు, ‘ఉమెన్ ఇన్ సినిమా’ అంశంపై ప్రత్యేక సంభాషణలు, లఘుచిత్రాల ప్రదర్శనలు తదితర కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్, నటీనటులు అభిమానులతో ముచ్చటిస్తూ, వారితో తమ అనుభవాలను పంచుకున్నారు.
2018లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’ యువతను విశేషంగా ఆకట్టుకుని కల్ట్ ఫిల్మ్‌గా గుర్తింపు పొందింది. స్నేహం, హాస్యం, పాత్రలు, సంభాషణలతో ప్రేక్షకులకు చేరువైన ఈ చిత్రం ఎనిమిదేళ్లుగా మీమ్స్, రీ-వాచెస్, సోషల్ మీడియా సంభాషణల రూపంలో అభిమానుల ఆదరణను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా బృందానికి, అభిమానులకు మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసేలా ఈ వేడుక సాగింది.
ఒకే సినిమాకు ప్రజల భాగస్వామ్యంతో పూర్తిరోజు వేడుక నిర్వహించడం తెలుగు చిత్ర పరిశ్రమలో వినూత్న ప్రయత్నంగా నిలిచింది. సాధారణంగా జరిగే ప్రీ-రిలీజ్ కార్యక్రమాలకు భిన్నంగా అభిమానులనే వేడుకలో ప్రధాన భాగస్వాములుగా చేయడం ఈ కార్యక్రమ ప్రత్యేకతగా నిలిచింది.
విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేశ్ కాకుమాను, శివాత్మిక రాజశేఖర్, అనీషా అంబ్రోస్ నటించిన ‘ఈఎన్‌ఈ రిపీట్’ నవంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఎనిమిదేళ్లుగా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకుల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతగా నిర్వహించిన ‘ఈఎన్‌ఈ డే’.. సినిమా, స్నేహం, అభిమానుల మధ్య ఉన్న అనుబంధానికి వేదికగా నిలిచింది.


