జేమ్స్ బాండ్‌గా నటించిన స్కాటిష్ నటుడు సీన్ కానరీ (90) శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో నిద్రలోనే కన్నుమూశారు. కానరీ మృతి యావత్ సినీ లోకాన్ని విస్మయానికి గురి చేసింది. జేమ్స్ బాండ్ సిరీస్‌కు చెందిన ఏడు సినిమాల్లో సీన్ కానరీ నటించారు. మొదటిసారిగా 1962లో వచ్చిన బాండ్ సిరీస్ ‘డా. నో సినిమాతో పాటు 1963లో వచ్చిన ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’, 1964లో వచ్చిన ‘గోల్డ్ ఫింగర్’, 1965లో వచ్చిన ‘థండర్‌బాల్’, 1967లో వచ్చిన ‘యూ ఓన్లీ లివ్ ట్వైస్’, 1971లో వచ్చిన ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’, 1983లో వచ్చిన ‘నెవర్ సే నెవర్ ఎగైన్’ వంటి జేమ్స్ బాండ్ సిరీస్‌లలో నటించారు.
2006లో అమెరికన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న సీన్ కానరీ ఆ తర్వాత వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు. సీన్ కానరీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆయన ఇక లేరనే వార్తతో అభిమానులు కన్నీళ్లుమున్నీరు అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో కానరీ మృతికి టాలీవుడ్ పరిశ్రమకు చెందిన చిరంజీవి, మహేష్ బాబు, వెంకటేష్, సాయిధరమ్ తేజ్‌లతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ‘ఐకానిక్ యాక్టర్, ఒరిజినల్ జేమ్స్ బాండ్ సీన్ కానరీ మరణం మనకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అనేక ఉత్కంఠభరితమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించిన ఆయన ఎప్పటికీ మన హృదయాలలో నిలిచి ఉంటారు. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని చిరు ట్వీట్ చేశారు.