ఎన్టీఆర్ నటించిన 200వ చిత్రం ”కోడలు దిద్దిన కాపురం” విడదలై నేటికి (21 అక్టోబర్ 1970 )సరిగ్గా 50 సంవత్సరాలు..

నేషనల్ ఆర్ట్ థియేటర్స్ తీపి జ్ఞాపకంగా తన నిర్మాణ సంస్థకు పేరు పెట్టుకున్నారు ఎన్టీఆర్ దాన్నుంచి నిర్మించిన మొదటి రెండు చిత్రాలు ‘పిచ్చి పుల్లయ్య’, ‘తోడు దొంగలు’ పరాజయాన్ని పొందాయి. ఆ అనుభవాలు నేర్పిన పాఠాలతో నందమూరి సోదరులు జీవితమంతా జాగ్రత్త పడ్డారు. అలా, ఈ ఇద్దరు సోదరుల నిర్మాణంలో వచ్చిన అద్భుత చిత్రం ‘కోడలు దిద్దిన కాపురం’. ఈ సినిమాలో వాణిశ్రీ, ఎన్టీఆర్‌తో జంటగా నటించింది. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్‌హిట్టయి ఇప్పటికీ జనం నాలుకల మీద నానుతూ ఉన్నాయి. సావిత్రి ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు వదినగా నటించటం విశేషం.

రూపంలో ఎన్టిఆర్ కు పోటీగా ఉంటాడు త్రివిక్రమరావు
యన్టిఆర్‌లా డిగ్రీలు లేవుకానీ, ప్రపంచాన్ని చదివాడు. సినిమా నిర్మాణంపై దీక్షా దక్షతలున్నాయి. యన్టిఆర్ కెరీర్లో మూడొంతులు కుడిభుజంగా నిలిచాడు. సినిమాకు శ్రీకారం చుట్టినప్పట్నుంచీ సినిమా విజయోత్సవ సంబరాలు జరుపుకునే వరకూ ప్రణాళిక రచన ఆయనే చేసేవారు. దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలికి సుమారు 15 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా సేవలందించాడు. ఒకరోజు యన్టిఆర్ ఒక లైను చెప్పారు. చిన్నాయన (త్రివిక్రమరావు)కు బాగా నచ్చింది. బావుందన్నా’!… దీన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తే బావుంటుందని సలహా ఇచ్చాడు. తమ్ముడు పచ్చజెండా ఊపేసరికి యన్టిఆర్‌కు ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేసింది. వెంటనే స్క్రీన్ ప్లే కూడా యన్టిఆరే రాసేశారు. నరసరాజుగార్ని పిలిపించారు. నరసరాజుగారు బావుందన్నారు! మనం కూర్చుందాం. ఈ సినిమాలో కోడలు పాత్ర హైలైట్ అవుతుంది. కథ ఆమె చుట్టూ తిరుగుతుంది. ‘మరి మీరేమంటారు? అంటూ’ అనుమానం వ్యక్తం చేశారు. ‘కానివ్వండి మనకు కథ బావుండాలి. సినిమా హిట్ అయితే అందరికీ మంచి పేరొస్తుంది. ఎన్నో కుటుంబాల్లో కలతలూ కన్నీళ్ళు మనం చూస్తున్నాం. అందుకే, ఈ చిత్రానికి ‘కోడలు దిద్దిన కాపురం’ అనే పేరుపెడదాం అనుకుంటున్నాం!’ అన్నారు ఎన్టీఆర్. తన మనసులో మాట చెప్పాక ఎదురేముంది చిన్నాయన భలే ఖుషీ అయిపోయారు.

132 యన్టీఆర్ వీధి
యన్.ఏ.టి బ్యానరులో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయంటే యన్టిఆర్‌కి, త్రివిక్రమరావుకు సందడే సందడి. రంగరాజపురంలోని 132 యన్టిఆర్ మీధిలో యన్టిఆర్ ఇల్లు పెద్ద సినిమా థియేటరంత హాలు పెద్ద ప్లేగ్రౌండంత కాంపౌన్డు. మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే డి.వి.యస్ రాజు, పుండరీకాక్షయ్య, చెరుకూరి పూర్ణచందర్రావు (విజయ పిక్చర్స్) అంతా అక్కడే ఉండేవారు. ఆస్థాన సంగీత దర్శకులు టి.వి.రాజు అన్నదమ్ముల కోరిక మేరకు స్వరరచన చేసేవారు. ఇప్పట్లా ట్యూను ఇవ్వడం పాటలు రాయడం కాదు. కవిగారు సిట్యుయేషన్‌కి తగ్గ మాటలు పొందుపరిస్తే దర్శకుడి ఆదేశాల మేరకు ఇంటర్ ల్యూడ్ మ్యూజిక్‌ని నింపేవారు. రిహార్సల్స్‌లోనే పాటలు పాడే గాయకులకూ నేర్పించేవారు. రిహార్సల్స్ జరుగుతున్నంత వరకూ పండగే పండగ. ముఖ్యంగా పెద్దాయనకీ చిన్నాయనకీ (అన్నదమ్ములు) పాటలంటే సందడే సందడి. పాటలు కూడా అంతే తీయగా వచ్చేవి. దాదాపు యన్.ఎ.టి బ్యానరులోని పాటలన్నీ సూపర్ హిట్సే.

ఇదీ కథ
రావుబహదూర్ (నాగభూషణం) గొప్ప సంపన్నుడు. ఆయనకి ఇద్దరు కొడుకులు జగ్గయ్య, ఎన్.టి.రామారావు. ఒక కూతురు సంధ్యారాణి. నాగభూషణం ఎపుడూ వ్యాపారాలు వ్యవహారాలు టూర్లతో బిజీగా ఉంటే ఆయన భార్య సూర్యకాంతం మూఢభక్తురాలు. ఎప్పుడూ బాబాలు, స్వామీజీల మైకంలో ఉంటుంది. ఆమె బలహీనతను అలుసుగా తీసుకుంటాడు దొంగబాబా. ఎప్పటికప్పుడు దొరికినంత దోచుకుంటాడు. ఇదిలా ఉండగా పెద్దకొడుకు రాము (జగ్గయ్య)కి అన్నీ చెడు అలవాట్లే. భార్య లక్ష్మీ (సావిత్రి)ని వదిలి చెడు తిరుగుళ్లు మొదలుపెడతాడు. మాల (విజయలలిత) అనే యువతిపై ఆకర్షితుడై, మత్తులో జోగుతూ ఉంటాడు. కుటుంబాన్ని భార్యా పిల్లల్ని పట్టించకోడు. చిన్నవాడు రంగా (ఎన్టీఆర్) మంచివాడు. పరుల మేలు కోరేవాడు. ఎవరికి ఆపద కలిగినా ఆదుకునేవాడు. కూతురు సంధ్యారాణి పాశ్చాత్యరీతుల పట్ల ఆకర్షితురాలవుతుంది. ఒక పక్క జగ్గయ్య తాగుబోతు, చెల్లెలు పెడదోవపడుతుంది. తల్లి బాబా మోజులో పడి ఉన్నదంతా దోచిపెడుతుంది. ఇంట్లో ఎవరి దారి వారిదే.. పనివాళ్లు ఇంటి పనులను పట్టించుకోరు. ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక నమ్మకస్తుడైన పనివాడు త్యాగరాజు. యన్టిఆర్ వదినను మాతృ సమానంగా చూస్తాడు. తన బాధ్యతను తెలుసుకుని ప్రవర్తిస్తుంటాడు. త్యాగరాజు బంధువు పార్వతి (వాణిశ్రీ) రంగా ప్రేమలో పడుతుంది. రంగా ఆమె మంచితనాన్ని అర్థంచేసుకుంటాడు. రంగా(యన్టిఆర్) వదిన లక్ష్మీ (సావిత్రి) ప్లాన్ వేసుకుని కుటుంబాన్ని ఎలా చక్కదిద్దారన్నదే కథ. జగ్గయ్యకు కనువిప్పు కలిగిస్తారు. దొంగబాబా అసలు గుట్టు బట్టబయలు చేస్తారు. తల్లి కళ్ళు తెరిపిస్తారు. చెల్లిని ఒక దారిలోకి తీసుకొచ్చి తన భర్తతో కాపురం చేసుకునేలా చూస్తారు. అలా కోడలు దిద్దిన ఆ కాపురం మళ్లీ కళకళలాడుతుంది.

నటీనటుల ఎంపిక
కోడలుదిద్దినకాపురం చిత్రంలో రంగాగా ఎన్టిఆర్, లక్ష్మిగా సావిత్రి, ఎన్టీఆర్ ప్రేయసి పార్వతిగా వాణిశ్రీ, రాముగా జగ్గయ్య, సచ్చిదానందస్వామిగా సత్యనారాయణ, రావుబహదూర్‌గా నాగభూషణం, రేలంగి వంటవాడిగా, కె.వి చలం మరో వంటవాడిగా, రావికొండల రావు ఇంకో వంటవాడిగా, పద్మనాభం శంకరంగా, రమణారెడ్డి శంకరం తండ్రిగా, నాగయ్య లాయర్‌గా, త్యాగరాజు నమ్మకస్తుడైనా ఇంటిపనివాడిగా, సూర్యకాంతం నాగభూషణం భార్యగా, విజయలలిత డ్యాన్సరు మాలగా నటించారు. పాత్రోచితంగా నటించడంలో అందరూ పోటీపడ్డారు. ఈ చిత్రంలో యన్.టి.రామారావు వాణిశ్రీ జంటగా నటించి విజయవంతమయ్యారు. ఈ చిత్రంలో సత్యనారాయణ దొంగబాబాగా, సూర్యకాంతం మూఢభక్తురాలుగా కలకాలం గుర్తుండిపోతారు. ఆ రోజుల్లో ఎన్నో వివాదాలకు తెరలేపింది ఈ చిత్రం. ఇక నరసరాజు మార్కు సంభాషణలు సినిమా ఆద్యంతమూ హాయిగా నడిపించేస్తాయి. ‘కోడలు దిద్దిన కాపురం’ చిత్రాన్ని చూడ్డానికి బళ్ళు కట్టుకునిశవచ్చేవారు. అంత విజయవంతమయ్యింది ఈ చిత్రం.

పాటలన్నీ సూపర్ హిట్లే
కోడలు దిద్దిన కాపురం’ చిత్రంలోని పాటల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. పాటలు ఏవీ కావాలని అతికించినట్లుండవు. అన్ని పాటలూ సందర్భశుద్ధిలోంచి పుట్టుకొచ్చినవే. సన్నివేశాలకు మాటలు అతికినట్లుగా అర్థవంతంగా ఉంటాయి. పాటలన్నిటినీ నారాయణరెడ్డి, కొసరాజులతో రాయించారు. మొదటిపాట సావిత్రిపై చిత్రీకరించిన పాట దేశభక్తి గీతం ‘నీ ధర్మం నీ సంఘం నీ న్యాయం మరువద్దు… జాతిని నిలిపి… మహనీయులనే మరువద్దు’ ఈ పాటను ప్రాధమికపాఠశాలల్లో విధిగా పాడుకొనేవారు. నారాయణరెడ్డి గారిచేత కావాలని ఈ పాట రాయించుకున్నారు. ఈ పాటను సుశీలమ్మ పాడారు. ‘నిద్దురపోరా సామి.. నా ముద్దూ మురిపాల సామి…’ ఎస్.పి.బాలు పాడారు. ఈ పాటలో లేతదనం మనం గమనించవచ్చు. ‘అంతా తెలిసి వచ్చానే.. నీ అంతే తేల్చిపోతానే…’ ఘంటసాల పాడగా ఎన్టీఆర్‌పై చిత్రీకరించారు. ఈ పాట కూడా నారాయణరెడ్డిగారే రాశారు. కొసరాజు గారు తన మార్కు పాటల్ని అందించారు వంటింటి ప్రభువులం పాకశాస్త్ర యోధులం’ రేలంగి, కె.వి.చలం రావికొండలరావుపై చిత్రీకరించిన పాట. ఆ రోజుల్లో వంట వాళ్ళపై ఒక కన్నేసి ఉంచేలా భయపెట్టిన పాట. మరోపాట యన్.టి.ఆర్ అన్న జగ్గయ్యకి కనువిప్పు కలిగించేందుకు వదిన సావిత్రితో కలిసి డ్యాన్సుచేస్తూ పాడినపాట. ‘క్లబ్బంటే అందరికీ భలే మోజు.. ఈ జబ్బు లేని వారు లేరు ఈ రోజు….’ ఘంటసాల పాడారు. ఇక మరో పాట ‘ఓం సచ్చిదానందం నీ సర్వం గోవిందా…’ ఈ పాటను మాధవ పెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు పాడారు దొంగబాబాగా వేసిన సత్యనారాయణపై చిత్రీకరించారు. అన్నిపాటలూ సూపర్ హిట్లే! సినిమా ఇంకా సుాపర్ హిట్.

కొన్ని వివాదాలు
ఎన్.టి.రామారావు వదిన పాత్ర సావిత్రితో కలిసి చేసిన డ్యాన్సుని కొందరు వ్యతిరేకించారు. తల్లిలాంటి వదినతో డ్యాన్సు చేయొచ్చా? అని ప్రశ్నించారు. దానికి ఎన్.టి.ఆర్ “ఇది కోడలు దిద్దిన కాపురం గనుక, కోడలు ఏమైనా చేయొచ్చు ఇది అంతర్నాటకం” అని సమాధానం ఇచ్చారు. మరొక వివాదం ‘ఓం సచ్చితానంద’ పాట.. దీనికి జవాబుగా ‘ఇటువంటి బలహీనతలు ఉండకూడదని చెప్పాం! అయినా జనం ఎంజారు చేశారు’ అన్నారు ఎన్టీఆర్

అవార్డులు-రివార్డులు
కోడలు దిద్దిన కాపురం’ బంగారు నందిని గెలుచుకుంది. ఈ చిత్రానికిగాను యన్టీఆర్ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు. ఎన్నో స్వచ్ఛంద సాంస్కృతిక సంస్థల అవార్డులు వచ్చాయి. నిర్మాత త్రివిక్రమరావుకు కాసుల పంట పండించిందీ చిత్రం. 1970లో వచ్చిన అన్ని సినిమాల్లోకి అతి పెద్ద హిట్ ఈ చిత్రం. అందుకే యన్.ఏ.టి బ్యానర్ కు ఒక ప్రామాణికత ఏర్పడింది.