
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. కార్తీక్ సంగీతం అందించగా సురేష్ రాగూటు సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన సెక్యూరిటీ సిస్టమ్‌లో అనూహ్యమైన ఉల్లంఘన జరుగుతుంది. భారత భద్రతా సంస్థలు ఈ విషయాన్ని గుర్తించి, దాని వెనుక ఉన్న వ్యక్తుల కోసం దర్యాప్తు ప్రారంభిస్తాయి. చీఫ్ ఆఫీసర్ పరం (కమల్ కామరాజు) ఈ మిషన్‌ను సీరియస్‌గా తీసుకుని తన బృందంతో రంగంలోకి దిగుతాడు. ఈ దర్యాప్తు చివరకు సాధారణ యువకుడు మరియంవాలి (నిహాల్ కోదాటి), అతని స్నేహితుడు పృధ్వీ (సూర్య శ్రీనివాస్) చుట్టూ తిరుగుతుంది. అసలు ఈ సెక్యూరిటీ బ్రీచ్‌కు మరియంవాలికి ఉన్న సంబంధం ఏంటి? పృధ్వీ ఇందులో ఎలా భాగమయ్యాడు? ఏజెంట్లు సారా, శీతల్, కనికా కపూర్, భక్తల్, అలీనా రాజ్ తదితరుల పాత్ర ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే సినిమా కథ.
నటీనటుల నటన :
మరియంవాలి పాత్రలో నిహాల్ కోదాటి తన నటనతో ఆకట్టుకున్నారు. సాధారణ వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు కలిగే భయం, అయోమయం, భావోద్వేగాలను సహజంగా చూపించారు. సూర్య శ్రీనివాస్ పృధ్వీ పాత్రలో ప్రత్యేకంగా మెప్పించారు. ముఖ్యంగా స్నేహానికి సంబంధించిన సన్నివేశాల్లో ఆయన నటన, కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయ్యాయి. కథ సీరియస్ మోడ్‌లోకి వెళ్లిన తర్వాత కూడా తన పాత్రలోని ఎమోషన్‌ను చక్కగా క్యారీ చేశారు. సారా పాత్రలో హర్షితా రావు కూడా ఆకట్టుకున్నారు. సెక్యూరిటీ ఏజెంట్‌గా యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలను కాన్ఫిడెంట్‌గా చేశారు. పరం పాత్రలో కమల్ కామరాజు గంభీరమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
చిత్ర విశ్లేషణ :
సినిమా ప్రారంభం నుంచే కథను నేరుగా పాయింట్‌లోకి తీసుకెళ్లడం ప్లస్‌గా నిలిచింది. శాటిలైట్ సెక్యూరిటీ బ్రీచ్, దేశానికి ఎదురయ్యే ముప్పు వంటి అంశాలతో ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. మరోవైపు మరియంవాలి, పృధ్వీ మధ్య స్నేహం కథకు ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థంలో కథ మరింత సీరియస్‌గా మారుతూ పలు మలుపులతో ముందుకు సాగుతుంది. దేశభక్తి, స్నేహం, సస్పెన్స్ అంశాలను దర్శకుడు బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చివరి భాగంలోని కొన్ని సన్నివేశాలు సినిమాకు మంచి ముగింపును అందిస్తాయి. స్పై థ్రిల్లర్ జానర్‌లో కొత్తగా ప్రయత్నించాలనే దర్శకుడి ఆలోచన కనిపిస్తుంది.
సాంకేతిక విశ్లేషణ :
టెక్నికల్‌గా సినిమా మంచి స్థాయిలో ఉంది. సురేష్ రాగూటు సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. యాక్షన్, సస్పెన్స్ సన్నివేశాలను ఆసక్తికరంగా చిత్రీకరించారు. కార్తీక్ రోడ్రిగ్జ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. థ్రిల్లింగ్ సీన్స్‌కు బీజీఎం మరింత ఇంపాక్ట్ తీసుకొచ్చింది. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ కథనం వేగంగా సాగేందుకు ఉపయోగపడింది. నిర్మాణ విలువలు కూడా కథకు తగ్గట్టుగా ఉన్నాయి. అయితే కొన్ని టెక్నికల్ పదాలు సాధారణ ప్రేక్షకులకు వెంటనే అర్థం కాకపోవచ్చు. అలాగే కొన్ని సన్నివేశాల్లో పాత్రలు ఎక్కువగా అనిపించే అవకాశం ఉంది.
ప్లస్ పాయింట్స్ :
కథ, నటీనటుల నటన, ట్విస్టులు, సస్పెన్స్, బీజీఎం
మైనస్ పాయింట్స్ :
కొన్ని సన్నివేశాలు, కొన్ని టెక్నికల్ పదాలు
సారాంశం :
స్పై థ్రిల్లర్‌కు స్నేహం, భావోద్వేగం, దేశభక్తిని జోడించి ‘సీక్రెట్ సోల్జర్’ను తెరకెక్కించారు. ఆసక్తికరమైన కథనం, మంచి నటన, ట్విస్టులు, ఆకట్టుకునే నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. స్పై థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘సీక్రెట్ సోల్జర్’ ఒక మంచి థ్రిల్‌ను అందిస్తుంది.


