“ది రెడ్ బ్యాగ్” చిత్ర రివ్యూ

రవి కుమార్ సీరపు దర్శకత్వంలో హరికృష్ణ సోమిశెట్టి నిర్మాతగా శేఖర్ మోపురి సంగీతం అందించిన చిత్రం ది రెడ్ బ్యాగ్. ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి శివ సర్వాణి ఎడిటింగ్ చేశారు. రాధ్య, మౌనిక, ఆకాంక్ష ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో రాసి, ప్రసాద్ బెహరా, కబీర్ దుహన్ సింగ్, గాయత్రి భార్గవి, వడ్లమణి శ్రీనివాస తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
అమెరికాలోని అరిజోనాలో ఉన్న ఒక పబ్‌లో విన్ని (రాధ్య) డ్యాన్సర్‌గా పని చేస్తుంటుంది. పబ్ ఓనర్ మైక్ (కబీర్ సింగ్) అమ్మాయిలను దారుణమైన వ్యాపారంలోకి దింపి, ఒక ఐలాండ్‌లో వంద కోట్ల విలువైన రిసార్ట్ నిర్మించాలని చూసే క్రూరుడు. ఇండియా నుంచి అక్కడకు వచ్చిన ఈషా, ఈవ్, బేబ్ అనే ముగ్గురు అమ్మాయిలు కూడా మైక్ మాయవలలో చిక్కుకుంటారు. ఈ నలుగురు అమ్మాయిలు మైక్ కబంధ హస్తాల నుండి ఎలా బయటపడ్డారు, వారి జీవితాలను మలుపు తిప్పిన ‘రెడ్ బ్యాగ్’ కథేంటి, చివరికి వారు అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించారనేదే వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల నటన:
విన్ని పాత్రలో రాధ్య మెప్పించగా, మిగతా ముగ్గురు కథానాయికలు గ్లామర్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాల్లోనూ చక్కగా నటించారు. విలన్‌గా కబీర్ సింగ్ క్రూరత్వాన్ని బాగా పండించగా, ప్రసాద్ బెహరా కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. నటి రాశి పాత్ర చిన్నదైనా బలమైన ప్రభావం చూపుతుంది.

సాంకేతిక విశ్లేషణ :
సాధారణ రివేంజ్ డ్రామానే అయినప్పటికీ, దర్శకుడు రవి కుమార్ సీరపు (లనాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేతో నేటి ట్రెండ్‌కి తగ్గట్టు స్టైలిష్‌గా తెరకెక్కించారు. సినిమా విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. కెమెరా పనితనం, సన్నివేశాల మూడ్‌ని పెంచే నేపథ్య సంగీతం (BGM), పబ్ పాటలు ఆకట్టుకుంటాయి. మెమరీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి పాటించిన నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.

చిత్ర విశ్లేషణ :
ప్రథమార్థంలో మాతృప్రేమ, తల్లి పడే ఆవేదన ప్రధానంగా సాగితే, ద్వితీయార్థంలో వచ్చే ఛేజింగ్స్, యాక్షన్ సీన్లు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. క్లైమాక్స్‌లో నలుగురు అమ్మాయిలు ‘రాబిన్ హుడ్’ తరహాలో సమాజానికి తోడ్పడే తీరు ఆకట్టుకుంటుంది.

సారాంశం :
పోస్టర్లలో కేవలం గ్లామర్‌ మాత్రమే కనిపిస్తున్నప్పటికీ, అంతర్లీనంగా స్త్రీ శక్తిని, మాతృత్వపు ఔన్నత్యాన్ని చాటిచెప్పే ఒక మంచి థ్రిల్లింగ్ ఎమోషనల్ మూవీ ‘ది రెడ్ బ్యాగ్’.

Related Articles

Latest Articles