
వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో సంగీత్ శోభన్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త సినిమా వివరాలను అధికారికంగా వెల్లడించారు. ‘సాహో’, ‘మ్యాడ్’ వంటి చిత్రాలకు పనిచేసిన ప్రణయ్ రావు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంగీత్ శోభన్‌కి హీరోగా ఇది 5వ చిత్రం.
విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్న ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై నిర్మాత సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది వారి సంస్థకు 15వ ప్రాజెక్ట్. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఒక “మిస్టరీ థ్రిల్లర్ కామెడీ”గా రూపొందనుంది. సస్పెన్స్, ఊహించని మలుపులతో పాటు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం కూడా ఈ సినిమాలో ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. దర్శకుడు ప్రణయ్ రావు హీరోకి సరిపోయేలా ఒక బలమైన కథను సిద్ధం చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. మంచి ఫామ్ లో ఉన్న హీరో, కొత్త దర్శకుడు, విజయవంతమైన నిర్మాణ సంస్థ కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.


