ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్. గోపీనాథ్ బయోపిక్‌గా సూర్య నటిస్తూ, నిర్మించిన ‘ఆకాశం నీ హద్దురా’ (తమిళంలో ‘సూరారై పొట్రు’) చిత్రాన్ని అక్టోబర్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకొనే అవకాశాలు లేకపోవడం వల్లే సహ నిర్మాత గునీత్ మోంగాతో కలిసి సూర్య ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సూర్యతో ‘సింగం’ మూవీ సిరీస్‌ను రూపొందించిన సీనియర్ డైరెక్టర్ హరి ఆ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని తాజాగా సూర్యకు లేఖ రాయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. “సూర్య నటించిన చిత్రాలను తెరపై చూస్తేనే బాగుంటుందనేది ఓ అభిమానిగా నా కోరిక. అందువల్ల ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని ఓటీటీలో నేరుగా విడుదల చేయాలన్న నిర్ణయంపై మరోసారి ఆలోచించుకోవాలి” అని హరి ఆ లేఖలో సూచించారు.
కాగా సూర్య తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ సమర్ధించారు. ఆరు నెలలుగా మహమ్మారి వ్యాప్తి కారణంగా జన జీవనం స్తంభించిపోయి ఉందనీ, అందుకు అనుగుణంగా థియేటర్లను కూడా మూసివేశారనీ, ఇప్పుడు అవి తెరుచుకున్నా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి కరోనాకు బలి చేయడం సరైన పని కాదనీ ఆయన అభిప్రాయపడ్డారు.
“నిజానికి వచ్చే జనవరి నెల వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశాలు లేవు. ఆ తర్వాత కూడా ఎలా ఉంటుందనేది అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సినిమాలను థియేటర్లలోనే విడుదల చేస్తాం, అందరూ థియేటర్లలోనే చూడండి అని ప్రజల ఆరోగ్యాలతో, వారి ప్రాణాలతో ఆటలాడటం చాలా తప్పు. అందుకని ఓటీటీలో నేరుగా ‘ఆకాశం నీ హద్దురా’ (సూరారై పొట్రు) చిత్రాన్ని విడుదల చేయాలని సంకల్పించిన సూర్య, ‘వి’ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించిన నాని లను నేను అభినందిస్తున్నాను. ‘వి’ చిత్రం తనకు మైలురాయి లాంటి 25వ చిత్రమైనప్పటికీ, నేటి వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఓటీటీలో విడుదల చేయడానికి నాని అంగీకరించడం ఎంతైనా అభినందనీయం. ఇంట్లో క్షేమంగా ఉంటూ, ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునేవాళ్లందరికీ సూర్య, నాని ఓ మార్గం చూపిస్తున్నారు. అలాగే, డైరెక్టర్ హరి సినిమాలకు నేను అభిమానిని. ప్రేక్షకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సూర్య తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలపాల్సిందిగా ఆయనను కోరుతున్నాను. సూర్య సినిమా థియేటర్లలో రిలీజైతే ఆయన అభిమానులందరూ పరుగెత్తుకొని వచ్చేస్తారు. అయితే వారి ప్రాణాలతో చెలగాటమాడే హక్కు మనకు లేదని గ్రహించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితికి తగ్గట్లు నేరుగా ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది” అని ఆయన తెలిపారు.
సుధ కొంగర దర్శకత్వం వహించిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంలో సూర్య, అపర్ణా బాలమురళి జంటగా నటించగా, మోహన్‌బాబు, పరేష్ రావల్, ఊర్వశి, కరుణాస్ కీలక పాత్రలు పోషించారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్, శిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై సూర్య, గునీత్ మోంగా సంయుక్తంగా నిర్మించారు.